Saturday, May 24, 2025

కశ్మీర్ విద్యార్థులు నేరస్థులా?

- Advertisement -
- Advertisement -

ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన మారణకాండను యావద్దేశం గర్హించింది. పర్యాటకులు ఏ మతం వారో పట్టిపట్టి ఆరా తీసి ఉగ్రవాదులు కాల్పులు జరపడం దేశం మొత్తం ముక్తకంఠంతో ఖండించింది. ఇప్పుడు అదే రీతిలో కశ్మీర్‌లోయ కాకుండా బయట ఉత్తరాది ప్రాంతాల్లో కశ్మీరీలపై దాడులు చేయడం ఆందోళన కలిగిస్తోంది. కశ్మీరీ అయితే చాలు వారి దాడులకు బలైనట్టే. ఈ దాడులకు పాల్పడుతున్న వారికి ఉగ్రవాదులకు తేడా ఏం లేదు. పహల్గాం ఉగ్రదాడితో ఎలాంటి సంబంధం లేకపోయినా, విద్యార్థులను, వ్యాపారులను నేరస్థులుగా ఇతర ప్రాంతాల్లో అనుమానించడం, దాడులు చేయడం తరచుగా జరుగుతున్నాయి. పహల్గాం సంఘటన జరిగిన ఆరురోజుల్లోనే ఈవిధంగా దేశం మొత్తం 17 సంఘటనలు జరిగాయి. ఎక్కువగా మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో ఒక వర్గానికి చెందిన మితవాద వర్గాల దురుసుతనమే ఈ సంఘటనల వెనుక కనిపిస్తోంది. పంజాబ్‌లో కశ్మీర్ విద్యార్థులను క్యాంపస్‌లోనే కర్రలతో, పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఉత్తరాఖండ్‌లో కాలేజీలనుంచి వెళ్లిపోవాలని బెదిరించారు.

ఢిల్లీలో జామియా, మిలియా ఇస్లామియా విద్యార్థిపై దౌర్జన్యం చేశారు. హిమాచల్‌ప్రదేశ్, ముస్సోరీలో కశ్మీరీ శాలువాలు విక్రయించే వ్యాపారులపై దాడులు జరిగాయి. కశ్మీర్‌లో ఏదైనా హింస జరిగితే కశ్మీరీలంతా అనుమానితులవుతుండడం పరిపాటిగా సాగుతోంది. పహల్గాం ఉగ్రదాడి బాధాకరమైన వాస్తవాన్ని వెల్లడించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చదువుకుంటున్న కశ్మీర్ విద్యార్థులకు భద్రత గాలిలో దీపంలా తయారైంది. దేశంలో వీరికి భద్రత కల్పించే పటిష్టమైన, వ్యవస్థాపరమైన యంత్రాంగం లేదు. అలాగని వారి భద్రతను ప్రజల భావోద్వేగాలతో మారుతున్న అభిప్రాయాలకు విడిచిపెట్టకూడదు.పహల్గాం వంటి దాడులకు పాల్పడే ముష్కరుల లక్షం కేవలం చంపడమే కాదు, సమాజాన్ని చీల్చడం, ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టడం, సామాజిక సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయడం, సామాజిక వర్గాల్లో అనుమానాలను ప్రేరేపించడం. ఈ నేపథ్యంలో మనం స్పష్టంగా తెలుసుకోవలసింది కశ్మీరీ విద్యార్థులను హింసించడం దేశభక్తిలో భాగం కాదు.

దేశాన్ని అంతర్గతంగా చీల్చాలనుకుంటున్న వారికి విద్యార్థులను దాసోహం చేయడమే అవుతుంది. ఈ హింసాకాండలు కొత్తేమీ కావు. కశ్మీర్ లోయలో ఏదైనా హింసాత్మక సంఘటన జరిగినా లేదా సైనికులు ముష్కరులకు బలైపోయినా, కశ్మీరీ విద్యార్థులకే తరచుగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. చాలా మంది విద్యార్థులు పేదరికంతోను, సంఘర్షణలతోను సతమతమవుతున్నా ఉన్నత చదువుల ద్వారా చక్కని భవిష్యత్ కోసం నిరీక్షిస్తున్నారు. వీరికి అన్ని విధాలా సహకారం అందడానికి బదులు కేవలం కశ్మీరీ అయినందున నేరస్థులుగా అనుమానించడం శోచనీయం. యూనివర్శిటీలు, ఇతర విద్యాసంస్థలు వీరిని పీడించే బందిఖానాలుగా మారుతుంటే పాలనా యంత్రాంగాలు పట్టించుకోవడం లేదు. కాలేజీ నిర్వాహకులు, చట్టాలు, పౌరసమాజం వారిని దేశసంక్షోభ సమయాల్లో బలిపశువులు కాకుండా చూడాలి. వారి ఫిర్యాదులను పరిష్కరించే అధికారులను నియమించాలి.

వివక్షకు తావు లేని విధానాలు అమలు చేయాలి. స్థానిక పోలీస్‌ల సహకారంతో వారికి మూకుమ్మడి దాడులనుంచి రక్షణ కల్పించాలి. విధానాలకు అతీతంగా వారి మానసిక క్షోభను నివారించే ప్రయత్నం చేయాలి. క్లిష్ట పరిస్థితుల్లో ఈ విద్యార్థులు తీవ్ర ఆవేదనకు, మానసిక నైరాశ్యానికి గురవుతున్నారు. దేశం పట్ల వారు తమ విధేయతను నిరూపించుకునేలా అవకాశం కల్పించాలి. దేశంలోని మరే ఇతర విద్యార్థి వర్గాలకు ఇలాంటి దుస్సంఘటనలు ఎదురు కాకుండా చూడాలి. ఇలాంటి చర్యలు తీసుకోకుంటే విద్యార్థుల్లో భయం పెరిగి, తమ గుర్తింపు ఎవరికీ తెలియకుండా కాలేజీ క్యాంపస్‌ల్లో దాక్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. తమ బాధలు ఎవరికీ చెప్పుకోలేక సుదీర్ఘకాల ఆందోళనలో మగ్గిపోవలసి వస్తుంది. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది జ్ఞాపకాలను నిజంగా మనం మన్నించాలనుకుంటే మతపరమైన ప్రతీకార ఉచ్చులో మనం ఇరుక్కోకూడదు. సంస్థాగత సంకల్పానికి మనం స్పందించాలి. అంతర్గతంగా సాగుతున్న ఈ సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర విద్యామంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కార్యాచరణ రూపొందించాలి.

క్లిష్టపరిస్థితుల్లో కశ్మీరీ విద్యార్థులకు ఎక్కడా, ఏ విద్యాసంస్థల్లోనూ వేధింపులు, బెదిరింపులు, దాడులు ఎదురు కాకుండా ఒక జాతీయ స్థాయి విద్యావిధానాన్ని అమలు చేయడం తప్పనిసరి. సామాజిక, సామరస్య వాతావరణాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఒక హింసాత్మక సంఘటన చాలన్న ముష్కరుల జోస్యానికి అవకాశం ఇవ్వరాదు. హింసకు మన సమాధానం ఐక్యత తప్ప పగ, ప్రతీకారం కారాదు. మనబలం కరుణే తప్ప ప్రతిదాడి కారాదు. కశ్మీరీ విద్యార్థులు కోరుకునేది మన నుంచి అనుమానం కాదు, మనం అందించే సంఘీభావం. ఇప్పుడు మనకు కావలసింది కశ్మీరీ విద్యార్థులకు పటిష్టమైన భద్రతా చర్యలు కల్పించడం. అమాయకులైన యువత నేరారోపణకు బలికాకుండా వారిని రక్షించుకోవడానికి మనం కృతనిశ్చయులమై ఉండాలి. పహల్గాం దాడి సమయంలో వివిధ ప్రాంతాల పర్యాటకులను కులమతాలకు అతీతంగా ఆదరించి అక్కున చేర్చుకున్నది కశ్మీర్ ముస్లింలే అన్న వాస్తవాలను మరిచిపోరాదు. బాధితులకు ఆపన్నహస్తం అందించిన కశ్మీర్ లోయపైన, అక్కడి ప్రజలపైన, విద్యార్ధులపైన ఎక్కడైనా వివక్ష చూపించడమంటే మనకు మనం శత్రువులం కావడమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News