కవిత వెనుక ఎవరున్నారు? గత కొంత కాలంనుంచి రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. రాజకీయ వర్గాల్లోనే కాదు రాజకీయాలపట్ల ఆసక్తి చూపించే సామాన్య ప్రజల్లో సైతం ఈ ప్రశ్న వినిపించింది. వైఎస్ షర్మిల రాజకీయ పార్టీని ప్రకటించినప్పుడు కూడా తెలంగాణలో సరిగ్గా ఇవ్వే మాటలు, ప్రశ్నలు వినిపించాయి. షర్మిలను అవుతానో, కెసిఆర్‌ను అవుతానో కాలమే చెబుతుంది అని కవిత ప్రకటించినప్పటికీ షర్మిల ప్రతిరూపమే స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి కవిత షర్మిల కన్నా చురుకైనవారు, విషయ పరిజ్ఞానం ఉంది. బాగా మాట్లాడుతారు. కానీ రాజకీయం మాత్రం అచ్చం షర్మిల రాజకీయాన్ని తలపిస్తోంది.
కవిత ఒక వైపు కెసిఆర్‌ను పొగుడుతూ, పార్టీ కన్నా తనకు కెసిఆర్ ముఖ్యం అని చెబుతూ కెసిఆర్‌ను పక్కన ఉన్న హరీశ్ రావు, సంతోష్‌లు అవినీతికి పాల్పడుతున్నారు అని ఆరోపిస్తున్నారు. అంటే కవిత ఉద్దేశం కెసిఆర్‌కు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియని అమాయకత్వంతో ఉన్నారని కవిత భావిస్తున్నారా? ఈటెల రాజేందర్ బిఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిన తరువాత ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. కెసిఆర్ ఒకసారి ఒకరిని డిస్ ఓన్ చేసుకున్నారంటే కలలో కూడా దగ్గరకు రానివ్వరు అని చెప్పుకొచ్చారు. అలానే ప్రస్తుత రాజకీయ నాయకుల్లో కెసిఆర్ అంతటి రాజకీయ చాణుక్యులు ఇంకొకరు లేరని, 24 గంటల్లో నిద్రలో తప్ప మిగిలిన సమయం అంతా రాజకీయాల గురించే ఆలోచిస్తారు అని చెప్పుకొచ్చారు. జీరో నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి, తెలంగాణ సాధించడమే కాకుండా రెండు సార్లు అధికారంలోకి పార్టీని తీసుకువచ్చిన కెసిఆర్‌కు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పడం రాజకీయ రంగం పట్ల అవగాహన లేమిని సూచిస్తుంది.
తెరాస ఆవిర్భావం కన్నా ముందు నుంచి జర్నలిస్ట్‌గా కెసిఆర్‌తో పరిచయం. సిఎంగా ఉన్నప్పుడు ఒకసారి తెరాస ఆవిర్భావ సమయంలో ఆ పార్టీ వార్తలు కవర్ చేసిన జర్నలిస్ట్‌లు ఎవరు, ఎక్కడ ఉన్నారు అనే చర్చ. వారిలో ఎవరి సేవలు అయినా ఉపయోగించుకొనే అవకాశం ఉందేమో అని వివరాల సేకరణ. కెసిఆర్‌కు బాగా తెలిసిన ఒక జర్నలిస్ట్ పేరు సూచించాను. దానిపై కెసిఆర్ నెగిటివ్‌గా తలఅడ్డం ఊపారు. ఇదేంటా అని నాకు అర్థం కాలేదు. పెద్ద పత్రిక, మంచి జర్నలిస్ట్.. అలా ఎందుకు? అని బయటకు వెళ్లి విచారిస్తే ఆ వ్యక్తి మరో కోణం తెలిసింది. సాటి జర్నలిస్ట్‌కు కూడా తెలియని అతని మరో కోణం కెసిఆర్‌కు తెలియడం ఆశ్చర్యం అనిపించింది. రాజకీయ నాయకులను తక్కువ అంచనా వేయవద్దు అందులోనూ శూన్యం నుంచి తుఫాన్ సృష్టించిన కెసిఆర్‌ను తక్కువగా అంచనా వేయడం అజ్ఞానం అవుతుంది.
దక్షిణ భారతదేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీ కూడా మూడవ సారి గెలవలేదు. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన తరువాత సహజంగా కొంత మోనాటీ ఏర్పడుతుంది. ఓటమికి అనేక కారణాలు ఉంటాయి. అమెరికా బెదిరింపులను సైతం లెక్కచేయకుండా పాకిస్థాన్‌ను రెండు ముక్కలు చేసిన ఇందిరా గాంధీ సైతం రాజకీయాల్లో బఫున్ లాంటి రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయారు. చరిత్ర ఇందిరా గాంధీని గుర్తు పెట్టుకున్నట్టు, గౌరవించినట్టు రాజ్ నారాయణ్‌ను గుర్తుపెట్టుకోదు. రాష్ట్రంలోనూ అంతే పదేళ్ల పాలన తరువాత కెసిఆర్ నాయకత్వంలో పార్టీ ఓడిపోవచ్చు. కానీ కెసిఆర్ ఉద్యమాన్ని, తెలంగాణ సాధించిన రాజకీయ చాతుర్యాన్ని తక్కువ చేయలేం. అలాంటి నాయకుడిని తన చుట్టూ ఏం జరుగుతుందో తనకు తెలియదు అన్నట్టుగా కవిత మాట్లాడడం విడ్డూరం.
కవిత పోరాటం ఏమిటో? ఎందుకో? లక్ష్యం ఏమిటో? కనీసం ఆమెకైనా స్పష్టత ఉంటే బాగుండేది. కాంగ్రెస్, బిజెపి నాయకులు ఎప్పటినుంచో చేస్తున్న ఆరోపణలు, యూట్యూబ్‌లో ఎప్పటి నుంచో వినిపిస్తున్న ఆరోపణలే కవిత వినిపించారు. ఆమె ఉద్దేశం ఈ ఆరోపణల వల్ల కెసిఆర్ రాజకీయంగా బలపడతాడు అనుకొంటున్నారా? బాధ్యతలేని యూట్యూబ్ ఆరోపణలకు, కవిత ఆరోపణలకు తేడా లేకుంటే ఎలా? షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టినప్పుడు జరిగిన చర్చనే ఇప్పుడు జరుగుతోంది. తెలంగాణ ప్రయోజనాలకోసం పోరాడే నిజమైన నాయకురాలిని నేనే అని షర్మిల ప్రకటిస్తే ఆమె వెనుక ఎవరున్నారు?ఆమెతో కాంగ్రెస్ ఈ నాటకం ఆడిస్తోందా? బిజెపి ఆడిస్తోందా? అనే చర్చ జరిగింది. కానీ ఆమె మాటల్లోని తెలంగాణ ప్రేమను ఎవరూ పట్టించుకోలేదు.
తెలంగాణలో అడ్రెస్ లేని తన పార్టీని ఆంధ్రలో అడ్రెస్ కోల్పోయిన కాంగ్రెస్‌లో విలీనం చేసినా ఎలాంటి తేడా కనిపించలేదు. ఆమెకే డిపాజిట్ దక్కలేదు.. న్యూస్‌కు సంబంధించిన న్యూసెన్స్ వాల్యూ తప్ప షర్మిల ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు.. ఇప్పుడు కవిత వెనుక ఎవరున్నారు అనే చర్చ సాగుతోంది. రాజకీయంగా లాభసాటి అనుకుంటే ఏ పార్టీ అయినా ఏమైనా చేస్తుంది.. కాంగ్రెస్ పాత్రనా? బిజెపి పాత్రనా అనేది తేలాలి.. బిజెపిని ఎక్కువగా విమర్శించలేదు అని కెసిఆర్‌ను తప్పుపడుతూ కవిత లేఖ రాయడం ద్వారా తొలిబాణం వేశారు. అలా అని ఆమె బిజెపి వైపు వెళ్ళారు అని వాదించ లేం. కవిత ఉద్దేశం ఏమిటీ? ఆమె లక్ష్యం ఏమిటీ? ఆమె వెనుక కాంగ్రెస్ ఉందా? బిజెపి ఉందా? ఇంకా స్పష్టత రాలేదు. కనీసం ఆమెకైనా స్పష్టత ఉందో లేదో తెలియాలి.. తన్నీరు హరీశ్ రావు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే కెసిఆర్ వెంట ఉండేవారు.. తెరాస ఆవిర్భావం తరువాత తొలి సభను హరీష్ రావు నిర్వహించారు.
పార్టీ పెట్టిన పది నెలలకు చేరాడు అని కవిత చేసిన మొదటి ఆరోపణ తుస్సుమంది. కాంగ్రెస్ గెలిచి వైఎస్ఆర్ సిఎం అయ్యాక డిగ్రీ కాలేజీల కోసం హరీశ్ రావు ఒక వినతి పత్రం సిఎంకు ఇచ్చారు.. సిఎం వైఎస్ఆర్కు రవిచంద్ అని అత్యంత విశ్వాసపాత్రుడు ఉండేవారు. ఆ రోజుల్లో ఉన్న జర్నలిస్ట్‌లు అందరికీ ఇతను మంచి మిత్రుడు.. హరీశ్ సిఎం వద్దకు వచ్చినప్పుడు రవిచంద్ బొకేను హరీశ్‌కు ఇచ్చి సిఎంకు ఇవ్వండి అని ఒత్తిడి తెచ్చి ఇప్పించాడు.. కాంగ్రెస్ శాసన సభా పక్షం కార్యాలయంలో రవిచంద్ అనేక సార్లు ఈ బొకే ఉదంతం మీడియాకు చెప్పేవాడు. బొకే తానే ఇప్పించి ఫోటో తీయించి మీడియాకు పంపి ఎలా ఇరకాటంలో పెట్టింది చెప్పేవాడు.. హరీశ్ బొకే కథ మొత్తం వెంటనే కెసిఆర్‌కు వివరించారు..
కవిత ఈ బొకే పిట్ట కథను తన ఆరోపణలకు బలమైన ఆధారంగా వాడుకోవడం హాస్యాస్పదం.. పార్టీ పుట్టక ముందునుంచి కెసిఆర్ వెన్నంటి ఉన్న హరీశ్ గురించి ఆమె ఆరోపణలు తేలిపోయాయి.. తనకేం కావాలో తనకే తెలియని పిల్లాడి ఏడుపులా ఉంది ఆమె రాజకీయం.. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి మూడు ప్రధాన రాజకీయ పక్షాల మధ్య ఆమె రాజకీయ పార్టీ పెడితే ఆటలో అరటి పండులానే మిగిలి పోతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో రమ్యరావు అని టివిల్లో, యూ ట్యూబ్‌లో తెగ కనిపించేవారు. కెసిఆర్‌ను తిట్టించడానికి ఈమెను ఉపయోగించే వారు. కెసిఆర్ ఇంకో బంధువును రవిచంద్ కాంగ్రెస్‌లో చేర్పించి పార్టీ పదవి ఇప్పించారు. కెసిఆర్‌ను తిట్టడమే అతని డ్యూటీ. అతనేమయ్యాడో పేరు కూడా గుర్తు రావడం లేదు. సోదిలో లేకుండా పోయాడు.. కెసిఆర్ కుమార్తె అనే గుర్తింపే తప్ప కవితకు మరో ప్రత్యేకత ఉండదు.. అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.. ప్రచారపరంగా కవిత రాజకీయం కాంగ్రెస్‌కు కాస్త ఊపిరి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతకు మించి సాధించేది కనిపించడం లేదు.
Also Read: ఒక్కరోజు కూడా ఎస్ఎల్బిసి ఆలస్యం కావొద్దు
- బుద్దా మురళి