Wednesday, September 3, 2025

రేవంత్ రెడ్డితో హరీష్ రావు కుమ్మక్కు… నాపై కుట్రలు: కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిసిలకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యమం చేశానని ఎంఎల్‌సి కవిత తెలిపారు. సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నానని దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. బిసిలకు జరుగుతున్న అన్యాయం, 42 శాతం రిజర్వేషన్ల హామీపై తాను పోరాడానని తెలియజేశారు. మంగళవారం మధ్యాహ్నం తనని బిఆర్ఎస్ పార్టీ తనని సస్పెండ్ చేసిందన్నారు. బుధవారం బిఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంఎల్‌సి పదవికి కవిత రాజీనామా చేశానన్నారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఎంఎల్‌సి కవిత మీడియాతో మాట్లాడారు. సామాజిక తెలంగాణపై మాట్లాడితే పార్టీ పెడుతున్నానని దుష్ఫ్రచారం చేశారని దుయ్యబట్టారు.

Also Read: కులవివక్ష లేనిదెక్కడ?

బిఆర్‌ఎస్‌కు సామాజిక తెలంగాణ అవసరం లేదా?… బౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా? అని అడిగారు. బంగారు తెలంగాణ అంటే మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపి సంతోష్ రావుల ఇంట్లో బంగారం ఉంటే సరిపోతుందా? మండిపడ్డారు. బిఆర్ఎస్ ను హస్తగతం చేసుకోవడానికి కుట్రలు జరుగుతున్నాయని,  మాజీ మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే విమానంలో ప్రయాణం చేసినప్పటి నుంచి తనపై కుట్రలు ప్రారంభమయ్యాయని, మీరిద్దరూ ఒకే విమానంలో కలిసి వచ్చారా? లేదా అనేది రేవంత్, హరీష్ చెప్పాలని నిలదీశారు. వివరణ ఇచ్చారు.  ప్రతి సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందన్నారు. ఉద్యమాలు ఎలా చేయాలని తన తండ్రి చిటికెన వేలు పట్టుకుని నేర్చుకున్నానని, దళితులకు మూడు ఎకరాలు ఇస్తామని చెప్పిన గొప్ప నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అని, బిసిలకు చేయూతనిస్తానని చెప్పి డబ్బులు ఇచ్చిన ఏకైక వ్యక్తి కెసిఆర్ అని కొనియాడారు. తన నాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని సామాజిక తెలంగాణపై మాట్లాడానని పేర్కొన్నారు. మహిళలకు ఇస్తామన్న రూ.2500 హామీపై పోస్టు కార్డు ఉద్యమం చేపట్టానని, పేదవాళ్లకు పింఛన్లు పెంచాలని ఉద్యమం చేశానని కవిత వివరణ ఇచ్చారు.

తెలంగాణ తల్లి స్వరూపాన్ని మారిస్తే రౌండ్‌టేబుల్ సమావేశం పెట్టానని, బనకచర్లపైనా సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడానని, భద్రాచలం వద్ద ఐదు గ్రామాల ముంపు సమస్యపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చానని తెలియజేశారు. తనపై అక్రమ కేసులు పెడితే ఐదున్నర నెలలు తీహార్ జైలులో ఉన్నానని, 2024 నవంబర్ 23 నుంచి ప్రజాక్షేత్రంలోకి వచ్చి అనేక కార్యక్రమాలు చేశానని, గురుకులాల్లో జరిగిన అన్యాయాలపై మొట్టమొదట మాట్లాడానన్నారు.  తెలంగాణ భవన్‌లో కూర్చొని తనపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పానని, తప్పేముందని, మహిళా ఎంఎల్‌సిపై కుట్రలు జరుగుతున్నాయంటే కనీసం ఎవరూ స్పందించలేదని కవిత తెలియజేశారు. కాంగ్రెస్‌తో కొట్లాడుతున్నాం కాబట్టే కెసిఆర్ కుటుంబంపై కుట్రలు జరుగుతున్నాయని, హరీష్ రావు పాల వ్యాపారంపై ఆరోపణలన్నీ ఏమయ్యాయని, వ్యక్తిగతంగా లబ్ధి పొందాలనుకునే వ్యక్తులు తన కుటుంబం బాగుండొద్దని కోరుకున్నారని, తనని పార్టీ నుంచి బయటకు పంపొచ్చు కానీ అన్ని విషయాలు కెసిఆర్‌కు తెలియాలని, తాను కెసిఆర్ మాదిరిగానే నేరుగా మాట్లాడతానని కవిత స్పష్టం చేశారు.

రంగనాయకసాగర్ వద్ద ఫామ్ హౌస్ ఉందని, ప్రభుత్వ భూమి కబ్జా చేశారని, తరువాత కేసు లేదన్నారు. కెటిఆర్‌పై ఎన్ని కేసులు పెట్టారు.. ఎన్ని సార్లు విచారణకు పిలిచారో అందరికీ తెలుసునని, కెసిఆర్‌పై ఒక నిర్ణయం తీసుకున్నాక అమలు చేసిన ఆ మంత్రి ఎవరో తనకు తెలుసుకదా? అని, అసెంబ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు చూస్తుంటే మ్యాచ్ ఫిక్సింగ్ కనబడటంలేదా?.. హరీష్‌రావు గురించి ఏమాత్రం మాట్లాడరుగానీ.. కెసిఆర్ కుటుంబంపై విమర్శలు చేయడం చూస్తునే ఉన్నామని, బిఆర్‌ఎస్‌లో పని చేస్తున్న అసలైన కార్యకర్తలకు మాత్రమే న్యాయం జరగాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో తొలి నుంచి హరీష్ రావు లేరని, కోటి రూపాయలు తీసుకొని వ్యాపారం కోసం ఎక్కడికో వెళ్లారని వార్తలు కూడా వచ్చాయని, టిఆర్‌ఎస్ పార్టీ పెట్టాక పది నెలల తరువాత వచ్చారని, అంతకు ముందు హరీష్ రావు లేడన్నారు. టిఆర్‌ఎస్‌కు చెడ్డపేరు రాగానే వైఎస్‌ఆర్‌ను హరీష్ రావు కలిసింది అందరూ చూశారని, ట్రబుల్ సృష్ఠించేది హరీషేనని, మళ్లీ పరిష్కరించినట్లు ప్రచారం చేసుకుంటున్నారని కవిత దుయ్యబట్టారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News