Sunday, May 4, 2025

మరో ‘మలి దశ’ ఉద్యమానికి అడుగులు?

- Advertisement -
- Advertisement -

భారత రాష్ట్ర సమితి రజతోత్సవం అంటే తెలంగాణ మలి దశ ఉద్యమ, రాష్ట్ర సాధన, నిర్మాణ చరిత్ర. దీనికి కర్త, కర్మ, క్రియ అంతా కెసిఆరే. ఇందులో ఎవరికీ ఎలాంటి పేచీ లేదు. మరొకరికి పేజీ కూడా లేదు. బిఆర్‌ఎస్ రజతోత్సవ సభ జరుగుతుందనగానే నేను ఉమ్మడి పది జిల్లాలలో చాలా గ్రామాల్లో తిరిగాను. జనం ఏమనుకుంటున్నారో, ఏ విషయాలపైన చర్చిస్తున్నారు తెలుసుకున్నాను. అధికారం ఉన్నా లేకున్నా కెసిఆర్ అంటే.. ఓ ఆకర్షణ.. ఓ ఉత్సాహం.. ప్రజల్లో ఉండే ఆ అభిమానం, ఆదరణ తగ్గేది కాదు. ఎందుకంటే ఆయన ఉద్యమకారుడు కాబట్టి. రజతోత్సవ సభలో ఆయన ఏమి చెబుతారా అని అందరిలోనూ ఆసక్తి. సమస్యలను విడమరిచి చెప్పే తత్వమే ప్రజల్ని ఆయనకు దగ్గర చేసింది. ప్రసంగంలో ఆయన చేసిన విమర్శలు కొందరికి తిట్లులా అనిపించినా జనానికి మాత్రం అవి జోకుల్లాంటివి.

ఇతరులు చేసినట్టు ముల్లులా హృదయాన్ని గుచ్చుకునేవి కావు. జనానికి నచ్చుతాయి. అందుకే ఆయన ఎక్కడ సభ పెట్టినా సొంతంగా రావడానికి ఇష్టపడుతారు. ప్రతిపక్ష నేతగా ఇప్పుడు రాష్ట్రంలోని సమస్యలపై ఏమి చెబుతారా.. పరిష్కరానికి ఏమి సూచిస్తారా అని ప్రజానీకం అనుకోవడం కనిపించింది. ఇంకెంతో మంచి చేస్తామన్న కాంగ్రెస్ మాటలు నమ్మి ప్రజలు ప్రభుత్వాన్ని మార్చారు. వచ్చి 18 నెలలయినా కొత్త మేలు జరగకపోగా, ఉన్నవి ఊడిపోతుండడం వారిలో అసంతృప్తికి కారణమవుతోంది. కొత్తదనం అంటే ఈ జేబులోవి తీసి ఆ జేబులో పెట్టడం, పథకాల పేర్లు మార్చడం కాదు. ఉన్నవాటిని కొనసాగిస్తునే మరికొన్ని కొత్తవి ఇవ్వడం. అలా జరగడం లేదన్న భావన అందరిలో ఉంది. ముఖ్యంగా రైతుబంధు అమలు కాకపోవడం రైతులలో నిరాశ నింపింది. ఈ పథకం కెసిఆర్ మానసపుత్రిక.

ఇది ఎన్నికల ప్రణాళికలో పెట్టి అమలు చేసినది కాదు. రైతుల ఆత్మహత్యల నివారణకు ఏమి చేయాలా అంటూ నిరంతరం జరిపిన ఆలోచనల్లో పుట్టినది. రైతులకు వ్యవసాయం ఖర్చులు పెరుగుతున్నాయి. పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఒకవేళ ధరలు పెంచితే అది కొనుగోలుదార్లపై భారం మోపినట్టవుతుంది. అది మంచిది కాదు. మరి, రైతులకు నష్టం రాకుండా చూడడం ఎలా? వారికి ప్రత్యక్షంగా నగదు అందించి రుణభారం, నష్టాల భయం లేకుండా చూడడమే మార్గం. అంటే రైతుల భారాన్ని కొంతవరకు ప్రభుత్వం మోయడం అన్నమాట. విత్తనాలు, ఎరువులపై రాయితీలు ఇవ్వడం, ఉచిత విద్యుత్తు సరఫరా చేయడం ద్వారా ఆదుకున్నా ప్రత్యక్షంగా నగదు బదిలీ చేసి రైతుల్లో భరోసా కల్పిస్తే ఆత్మహత్యల వరకు వెళ్లరని ఆలోచించి దీనికి రూపకల్పన చేశారు. రైతులపై ప్రభుత్వం ఎలాంటి పన్నులు, శిస్తులు వేయకుండా ప్రభుత్వమే ఎదురు డబ్బులు ఇచ్చే పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఇది భారత దేశ చరిత్రలోనే అపూర్వ ఘట్టం.

ఇదేమీ ఓట్ల కోసం ఉద్దేశించిన ఉచిత పథకం కాదు. దేశానికి వెన్నెముకైన అన్నదాత వంగకుండా, కుంగకుండా చేసే వినూత్న ఆలోచన. ఇది దేశం దృష్టిని ఆకర్షించడంతో కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో జాతీయ పథకంగా అమలు చేస్తోంది. దీన్ని ఇప్పుడు నిలిపివేయడంతో రైతులు ప్రశ్నిస్తున్నారు. కొత్త ప్రభుత్వం వస్తే ఇచ్చే సొమ్మును పెంచుతారనుకుంటే మొత్తానికే బందయింది. ఉన్న సదుపాయాన్ని రద్దు చేస్తే బాధ ఉండదా? లోపాలు సవరించడానికే నిలిపివేశామని చెబుతున్నా, వాటిని సరిదిద్దడానికి 18 నెలలు సరిపోవా? రుణమాఫీ చేశాం కాబట్టి రైతు భరోసా ఇవ్వడం లేదంటే ఎలా కుదురుతుంది? రుణమాఫీ కూడా పూర్తిగా జరగలేదు.

అది మళ్లీ వేరే ముచ్చట. ఉన్నవి కొనసాగించి, అదనంగా ఏమైనా ఇస్తేనే అభివృద్ధి చెందినట్టు లెక్క. కోతలు వేయడానికేనా కొత్త ప్రభుత్వం? అన్న చర్చ నడుస్తోంది. ప్రజలు ఆశించినట్టుగానే రజతోత్సవ సభలో కెసిఆర్ దీన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. రూ.10 వేల రైతు బంధును రూ. 15వేలకు పెంచుతామన్నారు. పెంచారా?’ అని అడిగారు. ‘వర్షం చినుకులు పడగానే రైతుల సెల్ ఫోన్లు ట్రింగు ట్రింగు మనేవి. ఇప్పుడు వస్తున్నాయా’? అని ప్రశ్నించారు. లేవు.. లేవు అని చేతులెత్తి ప్రజలే సమాధానం ఇచ్చారు. ఇలాంటి నిలదీతనే ప్రజలు కెసిఆర్ నుంచి ఆశించారు. ఏమి చెబుతారా అని ఆయన ప్రసంగాన్ని రాష్ట్ర మంత్రులు కూడా టివిల్లో మొదటినుంచి చివరి వరకు ఆసక్తిగా తిలకించడం గమనార్హం.

రైతులు మాట్లాడుకుంటున్న మరో మాట ‘మిషన్ కాకతీయ’. గొలుసుకట్టు చెరువులతో నీటి పారుదల రంగాన్ని ఆదర్శంగా నిలిపారు కాకతీయ ప్రభువులు. ఆ విధానాన్ని పునరుద్ధరించి చరిత్రకు, వర్తమానానికి అనుసంధానం చేయాలన్నది కెసిఆర్ ప్రయత్నం. మన ఊర్లే పడిన వర్షం నీరు మన ఊర్లోనే ఉండాలి. ఊర్లోని వర్షం నీరు వాగు, వంకల్లో చేరడం ఎందుకు? అది కృష్ణ, గోదావరిల్లో కలవడం ఎందుకు? ఆ నదుల నుంచి ప్రాజెక్టుల రూపంలో తిరిగి తెచ్చుకోవడం ఎందుకు? ఈ బెడదంతా లేకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ చెరువుల నిర్మాణం, ముఖ్యంగా పాత చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇచ్చారు. చెరువులు పూర్తిగా నిండగా మిగిలిన నీరే వాగుల్లో కలిసేలా ఏర్పాట్లు చేశారు.

ఇప్పుడు ఆ ముచ్చటే లేదు. ప్రత్యేక పథకం కాదు కదా, కనీసం ఉపాధి హామీ పథకం కింద కూడా చేపట్టడం లేదు. కళ్ల ముందు కనిపించే ఈ అభివృద్ధి కూడా కనుమరుగవుతుంటే రైతులకు బాధ అనిపించదా? దీనిని కూడా కెసిఆర్ ప్రజలను ప్రశ్నించారు. మిషన్ కాకతీయ ఏమయిందని అడిగారు. అన్నింటికన్నా ముఖ్యమైనది పింఛన్లు. పెరుగుతున్న ధరలు, అవసరాలకు అనుగుణంగా పెన్షన్లు పెంచుతారని అందరూ ఆశించారు. కాంగ్రెస్‌కు ఓటు వేయడానికి ఇది కూడా ఒక కారణం. పొరుగు రాష్ట్రంలో పింఛన్ నెలకు రూ. 4000కు పెంచారు. ఇక్కడ పెంపు ప్రస్తావనే లేదు. కొత్తవారికి ఇవ్వడమే లేదు. విధవరాలైన తన కుమార్తెకు పింఛను రాకపోవడంపై ఓ వృద్ధుడు మాట్లాడుతూ ‘ఇప్పుడే ఎన్నికలు వస్తే బాగుండు’ అని అన్నాడు.ఆయనలో గూడుకట్టుకున్న బాధకు ఇదే నిదర్శనం. నిరుపేదల సమస్యలను పట్టించుకోవడం లేదన్న ఆవేదన కనిపిస్తోంది.

రజతోత్సవ సభలో కెసిఆర్ దీనిపైనా ప్రజల నుంచే సమాధానాలు రాబెట్టారు. ‘పింఛను రూ. 2000 నుంచి రూ. 4000కు పెంచుతామని చెప్పారు.. ఇచ్చారా? ఇంట్లోని భార్యాభర్తలకు ఇద్దరికీ ఇస్తామన్నారు. ఏదీ?’ అని అడిగారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలనే కాదు.. బిఆర్‌ఎస్ చరిత్రను ప్రజలు యాదికి తెచ్చుకున్నారు. ఆ పార్టీ పుట్టుకను, ఎదుగుదలను అందరూ చూసిన వారే. 2001కి ముందు ఎందరో తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకొని మధ్యలో కాడి వదిలేసి చేతులు ఎత్తేశారు. ఆ తరువాత మరికొందరు కెసిఆర్‌కు సమాంతరంగా కూడా కొందరు నేతలు తెలంగాణ ఉద్యమాన్ని నడిపేందుకు ప్రయత్నించారు. కానీ నడపలేక, నడవలేక వారూ మధ్యలోనే తప్పుకున్నారు. ఒక్క కెసిఆర్ మాత్రమే తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఉద్యమాన్ని నిలబెట్టగలిగారు. ‘రౌతు కొద్దీ గుర్రం’ సామెత తెలుసు కదా- కెసిఆర్ తనదైన ఒడుపుతో ఉద్యమాశ్వాన్ని మునుముందుకు ఉరికించగలిగారు.

అయితే ఈ నిలబెట్టడంలో, ఉరికించడంలో కెసిఆర్ అనుసరించిన పద్ధతులు అనేకసార్లు వివాదాస్పదమయ్యాయి. విమర్శలకు తావిచ్చాయి. అయినా విద్వేషాలు మాత్రం కలిగించలేదు. కెసిఆర్‌లోని ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. ఆయన భాష, యాస. తెలంగాణ జీవభాషలో, పల్లె మాండలికంలో కెసిఆర్ చేసిన ప్రసంగాలు ఆనాడు ప్రజలను, నాయకత్వ శ్రేణులను ఆయన వైపు తిప్పుకున్నాయి. ‘అరే.. ఈయన మన లెక్కనే ఉన్నడు.. మనోళ్ల లెక్కనే మాట్లాడుతున్నడు..’ అని అందరూ ముచ్చటపడ్డారు. కెసిఆర్‌ది ఆకర్షణీయ రూపం కాదు. ఒడ్డూపొడవులోనూ అంతంత మాత్రమే. ‘ఈ బక్కోడు ఏం చేస్తాడులే..’ అని తెలంగాణ ఉద్యమంపట్ల నమ్మకం లేని వారు అపహాస్యం చేశారు.

కానీ నిరంతర అధ్యయనం, లోతైన అవగాహన, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడంలో పట్టు సాధించి వాటన్నిటినీ అధిగమించారు. తొలి రోజుల్లో ఆయన తెలంగాణ పల్లెల్లో చేసిన పాదయాత్ర.. తెలంగాణ రాష్ట్ర సాధన ఆవశ్యకతను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లగలిగింది. అన్ని పార్టీల నుంచి అనేక మంది నాయకులను టిఆర్‌ఎస్‌తో కలిసి నడిచేలా చేసింది. నినాదప్రాయంగా ఉన్న ఓ కలను ఆయన సాకారం దిశగా నడిపించారు. సిద్ధాంతకర్తగా పేరుపొందిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ లాంటి వాళ్లు అనేక సార్లు కెసిఆర్‌లోని విషయ పరిజ్ఞాన జిజ్ఞాసను, నాయకత్వ ప్రతిభను, దక్షతను కొనియాడారు. ఎవరికీ నమ్మకం లేకపోయినా రాష్ట్రాన్ని సాధించి చూపించారు. ఈ విజయాలన్నింటినీ ప్రతిపక్షంలో ఉంటూనే సాధించారు.

  • గోసుల శ్రీనివాస్ యాదవ్
    98498 16817
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News