పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో రెవెన్యూ వ్యవస్థను తన దగ్గర పెట్టుకొని కెసిఆర్ సర్వనాశనం చేశారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ పాలనలో మంత్రులకు పవర్ లేదని, స్వేచ్ఛగా సమీక్ష చేసుకునే పరిస్థితి ఉండేది కాదని ఆయన గుర్తుచేశారు. పదేళ్ల పాటు ఒక్క మంత్రిని కూడా సరిగా పనిచేయనీయ లేదని ఆయన ఆరోపించారు. సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరులతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ భారతి వల్ల 70 శాతం ప్రజలకు ఉపయోగం జరిగినా తాము సక్సెస్ అయినట్లే అని ఆయన చెప్పారు.
భూ భారతిలో కొత్త సాఫ్ట్‌వేర్ రాబోతోందని ఆయన ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి జరగదని, జరగనివ్వనని ఆయన హామీ ఇచ్చారు. త్వరలోనే రాష్ట్రంలో సర్వేయర్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన తెలిపారు. జూన్‌లో సర్వే మ్యాప్ ఫైలెట్ ప్రాజెక్టు ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తామని ఆయన వెల్లడించారు. సర్వేయర్ల కోసం 6 వేలు దరఖాస్తులు వచ్చాయని వాటిని భర్తీ చేయబోతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు సర్వేయర్లతో భూముల సర్వే నిర్వహిస్తామని, ప్రభుత్వ పర్యవేక్షణ సైతం ఉంటుందని ఆయన చెప్పారు.