చార్మినార్ సమీపంలోని గుల్జార్‌హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందడం పట్ల మాజీ సిఎం,బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించి కాపాడాలన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు తగిన ఆర్థికసాయం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ప్రమాద బాధితులకు పార్టీ అండగా ఉంటుంది: కెటిఆర్
గుల్జార్‌హౌస్ వద్ద జరిగిన అగ్నిప్రమాద ఘటన చాలా బాధాకరమని, ఇది తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. ప్రమాద బాధితులకు తమ పార్టీ అన్నిరకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఈ సంక్షోభ సమయంలో అవసరమైన ఏ సహాయానికైనా అందుబాటులో ఉంటాయని, ఈ ఘటనలో బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు బిఆర్‌ఎస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు అధికారులతో కలిసి పనిచేస్తారని తెలిపారు. స్థానిక బిఆర్‌ఎస్ పార్టీ నేతలకు ప్రమాద స్థలం వద్ద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.
ప్రభుత్వం ఈ అగ్నిప్రమాదానికి కారణాలను లోతుగా విచారించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఓల్డ్ సిటీతో పాటు హైదరాబాద్ నగరంలో అగ్ని భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని, అగ్నిమాపక శాఖ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. ఈ విషాద సమయంలో హైదరాబాద్ ప్రజలందరూ ఐక్యంగా నిలిచి, బాధితులకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.