మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై జ స్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరు తూ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్లు హైకోర్టు రిజిస్ట్రీ ప రిశీలనలో ఉన్నాయి. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్‌కు విచారణ అర్హత లేదని, ఆ కమిషన్ సమర్పించిన నివేదికను కొట్టి వేయాలని కోరారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తమ విజ్ఞప్తు లను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం కాళేశ్వ రం కమిషన్ వేసిందని, ప్రభుత్వానికి ఏది కావాలో కమిషన్ నివేదిక ఆ రకంగా ఉందని ఆరోపించారు. గత బిఆర్‌ఎస్ ప్ర భుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడి గడ్డ, సుందిళ్ల, అన్నారం బారాజ్‌ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2024, మార్చి 14న జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన న్యాయవిచారణ కమిషన్ దాదాపు 16 నెలల పాటు విచారణ జరిపింది. ఈ బారాజ్‌లకు సంబంధించిన డిపిఆర్, డిజైన్లను పరిశీలించిన కమిషన్.. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఇరిగేషన్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులను విచారించింది. విచారణలో భాగంగా అప్పటి సిఎం కెసిఆర్, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, నీటిపారుదల శాఖ హరీష్ రావును కూడా కమిషన్ విచారణ జరిపింది.
నాటి ముఖ్యమంత్రి కెసిఆర్, అప్పటి సాగునీటి మంత్రి హరీష్‌రావు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఐఏఎస్ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థలు, ప్రజాసంఘాలు.. ఇలా మొత్తం 115 మందిని విచారించిన కమిషన్ వారి వాంగూల్మం నమోదు చేసింది. వారి వాంగ్మూలాలను విశ్లేషించి గత నెల 31వ తేదీన జస్టిస్ పిసి ఘోష్ రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదికను అందజేసింది. విచారణకు సంబంధించిన వివరాలను కమిషన్ విశ్లేషణాత్మకంగా నివేదికలో పొందుపరిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నివేదికను త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెడతామని, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను స్వీకరిస్తామని సిఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. కాగా, కాళేశ్వరం కమిషన్ పూర్తి నివేదిక ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్‌రావు సిఎస్ రామకృష్ణారావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ తరుణంలో కాళేశ్వరం కమిషన్ నివేదికను రద్దు చేయలని కోరుతూ మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కెసిఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఉత్కంఠ నెలకొంది.