కుదుటపడిన బిఆర్‌ఎస్ అధినేత
ఆరోగ్యం నేడు మరోసారి వైద్య
పరీక్షలకు.. పరామర్శకు వచ్చిన
నేతలతో రాజకీయ పరిణామాలపై
చర్చ రైతన్నల అరిగోసపై ఆందోళన
ప్రభుత్వాన్ని నిలదీసేందుకు
కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచన
మన తెలంగాణ/హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజల ఆదరణ పొందేందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఎప్పటికప్పుడు సమాయత్తం చేయాలని బిఆర్‌ఎస్ అధినేత, మా జీ సిఎం కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తగు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. కొద్దిరోజుల క్రితం అస్వస్థతకు గురైన కెసిఆర్ ఆరోగ్యం కుదుటపడింది. గత గురువారం యశోద హాస్పిటల్‌లో చేరి న ఆయనకు రెండు రోజుల పాటు వైద్యపరీక్షలు నిర్వహించి డిశ్చార్జి చేసిన సంగతి తెలిసిందే. అ ప్పటి నుండి నంది నగర్ నివాసంలో ఆయన వి శ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా తన ను పరామర్శించేందుకు వస్తున్న పార్టీ సీనియర్ల తో పలు అంశాలపై చర్చిస్తున్నారు. కాగా వైద్యుల సూచన మేరకు
ఈ నెల 10 గురువారం మరోసారి యశోద హాస్పిటల్‌లో వైద్య పరీక్షలకు హాజరు కానున్నట్లు సమాచారం. తనను పరామర్శించడానికి వచ్చిన పార్టీ నాయకులతో పాటు నాటి తెలంగాణ ఉద్యమకారులతో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై ఆరా తీస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో నాటి తెలంగాణ పరిస్థితులు అనంతరం బిఆర్‌ఎస్ ప్రభుత్వ పదేండ్ల హయాంను పోలుస్తూ పార్టీ నాయకులతో ఆయన చర్చించినట్లు తెలిసింది. గత వారం రోజులుగా సాగిన చర్చల్లో, నదీజలాల పంపిణీ, సాగునీరు, రైతాంగం సమస్యల మీద అధినేత కేసీఆర్ దృష్టిసారించారు. తెలంగాణ గోదావరీ పరీవాహక ప్రాంతాన్ని మరోమారు ఎడారిగా మార్చే ఆంధ్రా బనకచర్ల నిర్మాణం మీద కేసీఆర్ చర్చల సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ దిశగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పకడ్బందీ పోరాట కార్యాచరణ కోసం వ్యూహాలు, ఎత్తుగడలను అధినేత సిద్దం చేశారని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వరినాట్లకు సిద్ధమైన రైతాంగాన్ని ఆదుకునే నాథుడేలేడని పార్టీనేతలు అధినేత ముందు వాపోతున్నారు. అదునుకు పదును అందక సరైన సమయానికి యూరియా అందక, సాగునీరు అందక, రాష్ట్ర రైతాంగం పడుతున్న బాధలపై అధినేత కెసిఆర్ ఆరా తీశారు. అస్తవ్యస్థమైన పాలనలో, కనీస వసతులు మౌలిక సదుపాయాలు కరువై, సామాన్యులు ఎదుర్కుంటున్న సమస్యలు, హైడ్రాపేరుతో పేదల ఇండ్లను కూల్చివేయడంతో తలెత్తుతున్న సమస్యలను ఈ సందర్భంగా పార్టీ నేతలు ప్రస్తావించారు. తమ వోట్లను కొల్లగొట్టి గద్దెనెక్కేందుకే రేవంత్ రెడ్డి కల్లబొల్లి హామీలిచ్చి తమను మోసం చేశాడనే భావన రాష్ట్రవ్యాప్తంగా నెలకొందని, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో వున్నారని, రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రేస్ నేతలు కనిపిస్తే తరిమికొట్టే పరిస్థితి ఏర్పడిందని పార్టీ నాయకులు అధినేత దృష్టికి తీసుకువచ్చారు.