హైదరాబాద్: తెలంగాణ బిజెపి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంఎల్ఎ ఎన్విఎస్‌ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని జోస్యం చెప్పారు. బుధవారం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ (Revanth) స్థానంలో బిఆర్ఎస్ అధినేత కెసిఆర్(KCR) ముఖ్యమంత్రి అవుతారని, కాంగ్రెస్‌లో బిఆర్‌ఎస్ విలీనం కాబోతోందని, జూన్ 2న లేదా డిసెంబర్ 9 తర్వాత విలీనం ఉంటుందన్నారు. కెటిఆర్ నాయకత్వంలో పని చేస్తానన్న హరీష్‌రావు వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని ఎన్విఎస్‌ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు.
రేవంత్ ప్రభుత్వంలో పేదలకు సంక్షేమ పథకాలు అందడం లేదని మండిపడ్డారు. ఒక గ్రామంలో కటిక పేద కుటుంబం, వికలాంగుల కుటుంబం, దళిత కుటుంబం కూడా అదేనని కానీ ఇందిరమ్మ ఇల్లు రాలేదన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వంలో ధనికులకే పథకాలు అందుతున్నాయని ధ్వజమెత్తారు. కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బిఆర్ఎస్ వాళ్లకు, రేవంత్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కు చెందిన వ్యక్తులకు సంక్షేమ పథకాలు అందుతున్నామని ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. రెండు ప్రభుత్వాలలో పేదవారికి సంక్షేమ పథకాలు అందడం లేదని దుయ్యబట్టారు.