Friday, July 4, 2025

కెసిఆర్ అసెంబ్లీకి రావాలి

- Advertisement -
- Advertisement -

అన్ని అంశాలపై చర్చలు జరుపుతాం
ప్రతిపక్షనేతగా ఆయన ఇచ్చే
సలహాలు, సూచనలు స్వీకరిస్తాం
కెటిఆర్‌తో మాకు సంబంధం లేదు
హరీశ్‌రావు ఎవరో నాకు తెలియదు
హ్యామ్‌రోడ్ల నిర్మాణానికి త్వరలోనే
టెండర్లు రూ.350కోట్లతో అప్రోచ్
రోడ్లు మూడేళ్లలో ఆర్‌ఆర్‌ఆర్ పూర్తి
రోడ్లు,భవనాలశాఖ మంత్రి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : కెసిఆర్ అసెంబ్లీకి రావాలని, ఆయన వస్తే అన్ని అంశాలపై చర్చ జరుపుతామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. హరీష్ రా వు, కెటిఆర్‌తో తమకు సంబంధం లేదని వాళ్లు లెక్కలోకి రారని, కెసిఆర్‌తోనే తమకు లెక్క అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అ న్నారు. కెసిఆర్, తాము ఉద్యమంలో పనిచేశామని, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన అన్నారు. హరీష్ రావు ఉత్తి ఎమ్మెల్యే మాత్రమే అని, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాదని కోమటిరెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేతగా కెసిఆర్ అసెంబ్లీకి వచ్చి తమ తప్పు, ఒప్పులను చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేశా రు. కెసిఆర్ సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, తప్పులను చూపిస్తే సరిదిద్దుకుంటామని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్‌తోనే తమకు లెక్క అని హరీష్ రావు ఎవరో తనకు తెలియదని ఆయన అన్నా రు. గురువారం ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బి కార్యాలయం లో హ్యామ్ రోడ్ల ప్యాకేజీపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ట్రాఫిక్ రద్దీగా ఉన్న రోడ్లను గుర్తించి ప్రాధాన్యత క్రమంలోనే హ్యమ్ మోడల్‌లో రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన ట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. సిఎంతో చర్చ జరిపి ఈ నెలాఖరు వరకు 15 ప్యాకేజీల వరకు సెప్టెంబర్‌లో పనులు మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో హ్యామ్ మోడల్ రోడ్లు వేశారని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రూ.6వేల 500 కోట్లను రోడ్ల కోసం విడుదల చేశామని ఆయన తెలిపారు. రూ. 15వందల కోట్లతో అప్రోచ్ రోడ్లు లేకుండా గ్రామాలకు లింక్ బ్రిడ్జిలను గత ప్రభుత్వం కట్టిందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం రూ. 350 కోట్లతో అప్రోచ్ రోడ్లను వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. సింగిల్ రోడ్లను సైతం పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.

వచ్చే ఎన్నికల నాటికి పెండింగ్ రోడ్లు, హ్యామ్ రోడ్ల పూర్తి
వచ్చే ఎన్నికల నాటికి పెండింగ్ రోడ్లు, హ్యామ్ రోడ్లను పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. హ్యామ్ రోడ్లపై ముఖ్యమంత్రి సలహా తీసుకొని త్వరలో టెండర్‌లను పిలుస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. హ్యామ్‌రోడ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి ఆగస్టు నెలాఖరు వరకు అగ్రిమెంట్ పూర్తి చేస్తామని, సెప్టెంబర్‌లో పనులు మొదలు పెడతామని ఆయన వెల్లడించారు. హ్యామ్ రోడ్లతో రాష్ట్ర రూపు రేఖలే మారిపోతాయని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. 40:60 శాతం ప్రకారం హ్యామ్ రోడ్లు ఎన్‌హెచ్‌ఏ మోడల్‌లో అందుబాటులోకి రాబోతున్నాయని, హ్యామ్ రోడ్లలో టోల్ ప్రసక్తి లేదని కేవలం రెండు రూట్‌లలో మాత్రమే టోల్ ప్రఫోజల్ ఉందని కోమటిరెడ్డి తెలిపారు. హ్యామ్ పద్దతిలో రోడ్ల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేస్తామని, నాలుగు లైన్ల రోడ్లను 6 లైన్లుగా మార్చడం వల్ల ప్రక్రియ ఆలస్యం అవుతోందని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌పై ప్రధాని మోడీని, కేంద్రమంత్రి గడ్కరీని కలుస్తా
రోడ్డు ప్రమాదాల ద్వారా మృతి చెందే వారి సంఖ్య ప్రపంచంలోనే ఇండియా మొదటిదని అందులో తెలుగు రాష్ట్రాలు సైతం మొదటి స్థానాల్లో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. విజయవాడ రూట్‌లో యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్‌లను గుర్తించామని అక్కడ పనులను చేపట్టామని ఆయన తెలిపారు. కెసిఆర్ కాంట్రాక్టర్లకు రూ. 3,400 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి వెళ్లిపోయారని గడిచిన ఐదేళ్లుగా ఒక్క రోడ్డు కూడా వేయలేదని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ట్రిపుల్‌ఆర్‌పై నితిక్ గడ్కరీ, ప్రధాన మంత్రిని కలుస్తానని ట్రిపుల్ ఆర్ కోసం 96 శాతం భూమిని సేకరించామని, టెండర్లు పిలుస్తామని మంత్రి పేర్కొన్నారు.

సదరన్ పార్ట్ ట్రిపుల్ ఆర్ ప్రాసెస్ త్వరలోనే మొదలు పెడతామని, రీజనల్ రింగ్‌రోడ్డును మూడేళ్లలో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఆరు లైన్ల రోడ్డు కోసం త్వరలో కేబినెట్ ఆమోదం లభిస్తుందన్నారు. టెండర్ ప్రక్రియ వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఓఆర్‌ఆర్ నిర్మాణం రాజశేఖర్ రెడ్డి హయాంలో పూర్తి అయ్యిందని, ఆర్‌ఆర్‌ఆర్‌తో హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత రావు, ఈఎన్సీ జయ భారతి, సీఈలు మోహన్ నాయక్, లక్ష్మణ్, రాజేశ్వర్ రెడ్డి పలువురు ఎస్‌ఈలు, ఈఈ, ఏఈ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News