కొద్ది రోజుల క్రితమే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌గా నిలిచిన సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం జింబాబ్వేతో తలపడుతోంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బులవాయో వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో సఫారీ జట్టు అదిరిపోయే ప్రదర్శన చేస్తోంది. ఈ క్రమంలో సౌతాఫ్రికా బౌలర్ కేశవ్ మహారాజ్ (Keshav Maharaj) అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో 200 వికెట్లు తీసిన తొలి సౌతాఫ్రికా స్పిన్ బౌలర్‌గా కేశవ్ చరిత్ర సృష్టించాడు. గతంలో ఏ స్పిన్నర్ కూడా ఈ మైలురాయిని తాకలేకపోయాడు. జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ వికెట్ కేశవ్‌కు 200వ టెస్ట్ వికెట్.
కేశవ్ (Keshav Maharaj) తర్వాత టెస్టుల్లో అత్యంత ఎక్కవ వికెట్లు తీసిన స్పిన్నర్ల జాబితాలో టేఫీల్డ్ (170), పాల్ ఆడమ్స్ (134), పాల్ హారిస్ (103), నికీ బోయే (100) ఉన్నారు. ఓవరాల్‌గా అయితే సౌతాఫ్రికా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డేల్ స్టెయిన్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతను తన కెరీర్లో 439 వికెట్లు తీశాడు. ఆ తర్వాత షాన్ పోలాక్ (421), ఎన్తిని (390), రబాడ (336), డొనాల్డ్ (330), మోర్కెల్ (309) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 9 వికెట్లు కోల్పోయి 418 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో జింజాబ్వే 7 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. క్రీజ్‌లో విలియమ్స్ (136), మసెకేసా (5) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించాలంటే జింబాబ్వే ఇంకా 175 పరుగులు చేయాలి.