న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖలు రాశారు. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ వంటి అనేక అంశాలపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించాలని ప్రధాని మోడీని కోరారు.
“తాజా పరిణామాల దృష్ట్యా, పహల్గామ్ ఉగ్రవాదం, ఆపరేషన్ సిందూర్, మొదట వాషింగ్టన్ డిసి నుండి, తరువాత భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాలు కాల్పుల విరమణ ప్రకటనలు చేయడం, ఆ తర్వాత పరిస్థితులపై చర్చించడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే అన్ని ప్రతిపక్ష పార్టీల ఏకగ్రీవ అభ్యర్థనను లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు ఇప్పటికే మీకు మళ్ళీ లేఖ రాశారు. రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా, నేను ఈ అభ్యర్థనకు మద్దతుగా లేఖ రాస్తున్నాను” అని మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు.
“పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదట ప్రకటించిన కాల్పుల విరమణ గురించి ప్రజలు, ప్రజా ప్రతినిధులు చర్చించడం చాలా ముఖ్యం. ఇది రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి మన సమిష్టి సంకల్పాన్ని ప్రదర్శించడానికి కూడా ఒక అవకాశం అవుతుంది. మీరు ఈ డిమాండ్‌ను త్వరగా పరిశీలిస్తారని నేను విశ్వసిస్తున్నాను” అని రాహుల్ గాంధీ అన్నారు.
కాగా, ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ దాడి చేసింది. తర్వాత పాకిస్తాన్ భారత్ పై దాడులు చేసింది. భారత్ ఆర్మీ కూడా తిరిగి దాడులు చేసింది. అనంతరం కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించిన సంగతి తెలిసిందే.