న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం నాడు లోక్ సభలో ప్రవేశపెట్టిన మూడు వివాదాస్పద బిల్లులపై ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహించడంతో గందరగోళం నెలకొంది. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒకదశలో ప్రతిపక్ష సభ్యులు బిల్లు ప్రతులను చించివేసి , హోం మంత్రి అమిత్ షా ముఖంపై విసిరివేశారు. ప్ర ధాని లేదా, ముఖ్యమంత్రులు ఎవరైనా వరుస గా 30 రోజులు అరెస్ట్ అయిన పక్షంలో వారిని పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లులు. హోం మంత్రి అమిత్ షా రాజ్యాంగం (130వ సవరణ)బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ(సవరణ) బిల్లు, జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు అనే మూడు బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష సభ్యులు లేచి నిలబడి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాదు, గందరగోళం సృష్టిస్తూ, బిల్లు ప్రతులను చించి వేశారు.
బీజేపీ ప్రభుత్వం తలపెట్టిన ఈ చట్టం క్రూరమైనదని,మంత్రులను, ముఖ్యమంత్రులను ఏకపక్షంగా అరెస్ట్ చేయడం ద్వారా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను అస్తిరపరచే కుట్రతో ప్రభుత్వం దీనిని తీసుకువస్తోందని ఆరోపించారు. బిల్లులను పరిశీలన కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలని హోమంత్రి ప్రతిపాదిస్తుండగా, తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, ఇతర ప్రతిపక్ష నాయకులు బిల్లుల కాపీలను చించి వేసి అమిత్ షా పై విసిరివేశారు. మంత్రికి అతి సమీపంలో చించివేసిన కాగితం ముక్కలు పడడం కన్పించింది. కాగా బిల్లుల కాపీలను చించి వేసిన ఆరోపణను బెనర్జీ ఖండించారు. ఈ బిల్లులో ప్రస్తుతం సిటింగ్ మంత్రులపై ఎలాంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినా వారిని తొలగించేందుకు నిబంధనలు లేవు. ఈ సందర్భంగా లోక్ సభలో హోం మంత్రి అమిత్ షాకు, కాంగ్రెస్ ఎంపీ కెసి వేణుగోపాల్ కు మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరిగింది. సోహ్రాబుద్దీన్ ఫేక్ నకిలీ ఎన్ కౌంటర్ కేసులో బీజేపీ నాయకుడి అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించడంతో వాగ్వాదం జరిగింది.
షా నైతికతను నిలదీసిన వేణుగోపాల్
గుజరాత్ లో హోం మంత్రి గా ఉన్నప్పుడు తీవ్రమైన ఆరోపణలతో అరెస్ట్ అయి 30 రోజులు నిర్బంధంలో ఉన్న అమిత్ షా ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడంలో నైతికత ఏమైనా ఉందా అని వేణుగోపాల్ నిలదీశారు. ఆ సమయంలోఅమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ మధ్య వాగ్వాదం జరిగింది. తన అరెస్ట్ కు ముందే తాను రాజీనామా చేశానని అమిత్ షా వివరించారు. అమిత్ షా ప్రవేశపెట్టిన బిల్లు దేశ ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగించేదిలా ఉందని, ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలను దెబ్బతీసేదిలా ఉందని వేణుగోపాల్ వాదించారు. ఈ బిల్లు రాజకీయాల్లో నైతికతను తీసుకురావడానికి ప్రవేశ పెడుతున్నట్లు బీజేపీ నాయకులు చెబుతున్నారని, గుజరాత్ హోం మంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షా అరెస్ట్ అయ్యారని.
ఆ సమయంలో ఆయన నైతికతను సమర్థించారా అన్నప్పుడు అమిత్ షా తీవ్రంగా స్పందించారు. కేంద్ర హోం మంత్రి వివరణ ఇస్తూ, తనపై తప్పుడు ఆరోపణలు వచ్చాయని,తనపై విచారణ కొనసాగినంత కాలం, నైతిక కారణాల వల్ల రాజీనామా చేశానని, కోర్టు అన్ని ఆరోపణల నుంచి విముక్తి చేసేవరకూ ఎలాంటి రాజ్యాంగ పదవి చేపట్టలేదని స్పష్టం చేశారు. తన నైతికతను ప్రశ్నించవద్దని, ఆరోపణలు వచ్చినా పదవులు పట్టుకుని వేలాడిన వారు తమ నైతికతను ప్రస్నించడం ఆశ్చర్యం అని అమిత్ షా పేర్కొన్నారు. 2014 లో సీబీఐ ప్రత్యేక కోర్టు అమిత్ షా కేసులో ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ, ఆయనను అన్ని కేసులనుంచి విముక్తి చేసింది.
లోక్ సభలో నిరసన తెలుపుతున్న తమ పార్టీకి చెందిన ఇద్దరు మహిళా ఎంపీలపై కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు రవ్ నీత్ సింగ్ బిట్టు దాడి చేశారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఆరోపించారు. ప్రధాని, ముఖ్యమంత్రులపై తీవ్రమైన ఆరోపణల కారణంగా అరెస్ట్ అయి, 30 రోజులు కస్టడీలో ఉన్నపక్షంలో వారిని పదవి నుంచి తొలగించేడంతో పాటు మూడు బిల్లులకు వ్యతిరేకంగా ఎంపీలు నిరసన తెలిపారు. ఆ సమయంలో మంత్రులు ఇద్దరు మహిళా ఎంపీలపై దాడి చేశారని, వారిని బర్తరఫ్ చేయాలని కల్యాణ్ బెనర్జీ డిమాండ్ చేశారు. ఆ ఆరోపణలను బీజేపీ ఖండించింది.
లోక్ సభ సెక్రటేరియట్ వర్గాలు సిసిటివి ఫుటేజ్ ని పరిశీలించాయని, దాడికి సంబంధించి ఎలాంటి ఆదారాలు కన్పించలేదని తెలిపాయి. కొందరు ప్రతిపక్ష ఎంపీలు వెల్ లోకి వెళ్లినా, అధికార పార్టీ ల ఎంపీలు ఎవరూ దాడి చేసినట్లు కానీ, తోసుకున్నట్లు కానీ కన్పించలేదన్నారు. కాగా, సభలో తాము నినాదాలు చేస్తుండగా, అప్పటికే స్పీకర్ వెల్ వైపు వెళ్లిన ఇద్దరు తృణమూల్ మహిళా ఎంపీలు శతాబ్ది రాయ్, మితాలీ పై మంత్రులు బిట్టు, కిరణ్ రిజిజు దాడి చేయడానికి వచ్చారని, వారు మహిళా ఎంపీలను నెట్టివేశారని బెనర్జీ విలేకరులతో అన్నారు. మంత్రులు వెంటనే పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.