హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రిజర్వేషన్లతో నిజమైన బిసిలు నష్టపోతారని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. బిసిలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారని అన్నారు. నాంపల్లిలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..10 శాతం ఈబిసి రిజర్వేషన్లను ముస్లింలు కూడా పొందుతున్నారని తెలియజేశారు. 42 శాతం రిజర్వేషన్లతో బిసిలకు (BCs 42 percent reservations) న్యాయం జరగదని చెప్పారు. బిసి రిజర్వేషన్ వల్ల ఎంఐఎం పార్టీకే లబ్ది చేకూరుతుందని అన్నారు. బిసిని ముఖ్యమంత్రి చేసిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందా అని ప్రశ్నించారు.
బిసిని ప్రధానిని చేసిన ఘనత బిజెపిదే అని కొనియాడారు. రాజకీయ లబ్ది కోసమే బిసి రిజర్వేషన్ అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎత్తుకుందని విమర్శించారు. ప్రజలు తిరస్కరిస్తున్నా కాంగ్రెస్ కు బుద్ధి రాలేదని మండిపడ్డారు. అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని, నరేంద్ర మోడీ కులాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే బిసి జాబితాలో చేర్చిందని చెప్పారు. పెంచిన బిసి రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.