Saturday, September 13, 2025

ఆయుర్వేద పద్ధతులను, యోగాను అణచి వేసే కుట్ర:మంత్రి కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం బహుళజాతి కంపెనీలు, అలోపతి మందుల కంపెనీలు ఆయుర్వేద వైద్య పద్ధతులను, యోగాను అణచి వేసే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. యూసుఫ్‌గుడాలోని ఎన్‌ఐఎంఎస్‌ఎంఇ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ ఆయుర్వేదానికి వ్యతిరేకంగా ప్రపంచంలో ఒక లాబీ పని చేస్తున్నదని, ఈ లాబీని తట్టుకుని ఆయుర్వేదానికి ప్రాధాన్యతనివ్వాలంటే మనం సమర్థవంతంగా పని చేస్తూ తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాందేవ్ బాబా వంటి వారు కొన్ని మందులు తీసుకుని వస్తే, దానిపై సుప్రీం కోర్టులో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు.

ఇటువంటి సమయంలో మన సంస్కృతిని పరిరక్షించుకోవడంలో భాగంగా ప్రతి ఒక్కరూ మాట్లాడాలని, అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయుర్వేదాన్ని కాపాడుకుంటూ ఆయుర్వేదాన్ని మనకు అందిస్తున్న మహానుభావులకు, గురువులకు అండగా ఉండాలని ఆయన సూచించారు. రాజకీయాలకు సంబంధం లేకుండా యోగాను ఆయుర్వేదాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. వైద్యులు ఉపాధి కోసమే పని చేయాలన్న ఆలోచనలను పక్కన పెట్టి, ఇది మన దేశ సంపద, ఇది మన జీవన విధానం, భారతీయ వైద్యం అని భావితరాలకు దీనిని అందించాలన్న సంకల్పంతో పని చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.

Also Read: మహిళలు, చిన్నారుల భద్రతకు త్వరలో నూతన విధానం:మంత్రి సీతక్క

2016 జూన్‌లో అమెరికా కాంగ్రెస్ ప్రధాని నరేంద్ర మోడి ప్రసంగిస్తూ యోగా భారత దేశపు ప్రాచీన విజ్ఞానమే అయినా దీనిపై తాము మేధో సంపత్తి హక్కు తీసుకోలేదని అన్నారని ఆయన గుర్తు చేశారు. మానవాళి శారీరక, మానసిక ఆరోగ్యానికి అవసరమైన యోగాను యావత్ ప్రపంచానికి అందించాలన్న లక్షంతోనే తాము ఐపిఆర్ తీసుకోలేదన్నారు. శాంతియుత, ఆరోగ్య ప్రపంచ నిర్మాణం కోసం భారత దేశం అందించిన కాను యోగా అని చాలా సందర్భాల్లో ప్రధాని మోడి చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా ఆయుర్వేదం, యోగాతో పాటు నేచురోపతి, యునాని, సిద్ద వైద్యం, సోవా రిగ్పా, హోమియోపతి వంటి వాటికి ప్రోత్సాహం అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఇందుకు తగిన విధంగా విధానాల్లో మార్పులు తీసుకుని వస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించడం, ప్రజల దైనందిన జీవితంలో ఆయుర్వేదాన్ని ఓ భాగంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

ఆధునిక శాస్త్ర, విజ్ఞానానికి మన ప్రాచీన జ్ఞానాన్ని జోడించేందుకు ఇదే సరైన సమయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయుర్వేద విభాగం మేధావులకు, ప్రాక్టిషనర్లకు పిలుపునిచ్చారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించాలన్న ప్రయత్నంలో ఆరోగ్య భారత నిర్మాణం కూడా మన సంకల్పంలో భాగం కావాలని, ఇందు కోసం ‘ఆయుష్’ విభాగం ముఖ్య పాత్ర పోషించాలని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పిన మాట స్పూర్తితో, మనమంతా కలిసి పని చేద్దామన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన విశ్వ ఆయుర్వేద పరిషత్, తెలంగాణ చాప్టర్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News