కేంద్రం పిలిచినప్పుడు ఢిల్లీకి వెళ్లకుండా కెసిఆర్ ఫామ్‌హౌస్‌కు
వెళ్లాలా? ఫామ్‌హౌస్‌కు వెళ్తే సమస్యలు పరిష్కారమవుతాయా?
కెటిఆర్‌ది గంజాయి బ్యాచ్ ఆయన మిత్రుడు దుబాయిలో డ్రగ్స్
తీసుకొని చనిపోయాడు కెటిఆర్ నాయకత్వాన్ని కవిత ఒప్పుకోవడం
లేదు గవర్నర్‌కు పంపిన ఆర్డినెన్స్.. రాష్ట్రపతికి పంపిన బిల్లు
ఒక్కటి కాదు లోకేశ్‌ను కెటిఆర్ రహస్యంగా ఎందుకు కలిశారు?
ఇడి కేసులు నమోదు చేసినా కెటిఆర్, కవితను ఎందుకు అరెస్ట్
చేయడం లేదు? కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి
తుమ్మిడిహట్టి కోసం మహారాష్ట్రలో పర్యటిస్తాం బనకచర్ల సహా
అన్ని అంశాలపై కమిటీ ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం
మన తెలంగాణ హైదరాబాద్:మాజీ సిఎంకెసిఆర్ కుటుంబం కడుపునిండా విషం పెట్టుకుని మాట్లాడుతోందని సిఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కెసిఆర్ అసెంబ్లీకి వచ్చి రాష్ట్రప్రభుత్వానికి తగిన సూ చనలు ఇవ్వాలని, ఆయన ఇచ్చిన సూచనలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చే శారు. సమస్యల పరిష్కారానికి పిలిచినప్పుడు కేం ద్రం వద్దకు వెళ్లకుండా కెసిఆర్ ఫామ్‌హౌస్‌కు వె ళ్లాలా? అని ప్రశ్నించారు. ఫామ్‌హౌస్‌కు వెళితే స మస్యలెలా పరిష్కారమవుతాయని సీఎం ఎద్దేవా చేశారు. సిఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనలో భాగంగా రెండో రోజు గురువారం ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్భం గా కెటిఆర్, బిఆర్‌ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కెసిఆర్, జగన్ ఇద్దరు సిఎంలు కలిసినపుడు తప్పు కానపుడు తాను చంద్రబాబు నాయుడును కలిస్తే తప్పెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షనేతగా కెసిఆర్ ఢిల్లీకి వెళ్లవచ్చని, రాష్ట్రం కోసం కెసిఆర్ పని చేస్తానంటే ఎవ రూ అడ్డుకోరన్నారు.
సొంత వివాదాలతోనే కెసిఆర్ కుటుంబానికి సరిపోతోందని, కెటిఆర్ నాయకత్వాన్ని కవిత ఒప్పుకోవట్లేదని విమర్శించారు. కెటిఆర్ బిఆర్‌ఎస్‌కు వర్కింగ్ ప్రెసిడెంటా…స్లీపింగ్ ప్రెసిడెంటో అర్థం కావడంలేదన్నారు. తాను చర్చిస్తానంటోంది ప్రతిపక్షనేత కెసిఆర్ ర్‌తో మాత్రమేనని, కెటిఆర్‌తో కాదని వెల్లడించారు. ప్రతిపక్షనేత పదవి ఇవ్వాలని కేసీఆర్‌ను ఆయన కుమారుడు, మాజీ మంత్రి కెటిఆర్ అడుగుతున్నారని, కెటిఆర్ కోరికను కెసిఆర్ ఒప్పకోవడం లేదని సిఎం అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో లాగా తాము ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయలేదని, చేయబోమని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కెసిఆర్ హయాంలో ఏం జరిగిందో వారి కుటుంబసభ్యులే బయటికి వచ్చి చెబుతున్నారని, తన సొంత ప్రయోజనాల కోసం కాకుండా తెలంగాణ ప్రయోజనాల కోసమే తాను ఢిల్లీకి వెళ్తున్నానని సిఎం చెప్పుకొచ్చారు.
కెటిఆర్‌ది గంజాయి బ్యాచ్ : దుబాయిలో కెటిఆర్ స్నేహితుడు కేదార్ డ్రగ్స్ తీసుకుని చనిపోయాడని సిఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టును తమ ప్రభుత్వం తెప్పించిందని చెప్పారు. కెటిఆర్ గంజాయి బ్యాచ్ అని, అతని చుట్టూ ఉండేవాళ్లు డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపించారు. కేదార్‌తో కలిసి కెటిఆర్ దుబాయిలో డ్రగ్స్ తీసుకున్నారని, డ్రగ్స్ కలగలిపి తీసుకోవడం వల్లే కేదార్ మరణించారని, కేదార్ మరణంపై పూర్తి నివేదిక ఉందన్నారు. మద్యంలో కాక్‌టెయిల్ విన్నామని, డ్రగ్స్‌లో కాక్‌టెయిల్ వినలేదని అది ఇప్పుడే వింటున్నామని తెలిపారు. అవసరమైనప్పుడు కేదార్ మరణ కారణాల రిపోర్టు బయటపెడతామన్నారు. కేదార్ మరణ కారణాల రిపోర్టు అసెంబ్లీలో పెట్టడానికి సిద్ధమేనని, గతంలో డ్రగ్స్ కేసులో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది తాను కాదని, ఛాలెంజ్ చేయడం…కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోవడం కెటిఆర్‌కు అలవాటే అని ఎద్దేవా చేశారు. శాఖాపరమైన విచారణలు రాత్రికి రాత్రి పూర్తి కావన్నారు. హైదరాబాద్‌లో ఎపి మంత్రి లోకేశ్‌ను కేటీఆర్ చీకట్లో మూడు సార్లు ఎందుకు కలిశారని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆయన ఎందుకు కలిశారో సమాధానం చెప్పాలన్నారు.
కేసుల విచారణలో పురోగతి ఏదీ : హైకోర్టు పర్యవేక్షణలో ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతోందని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి ఇవ్వాలని కొందరు అడుగుతున్నారని, ప్రభాకర్‌రావుని రప్పించడంలో కేంద్రం ఏడాదిన్నర ఆలస్యం చేసిందని, రాష్ట్ర దర్యాప్తులో ఏం తప్పులున్నాయో ఎత్తి చూపించాలని కోరారు. రాష్ట్రంలో దర్యాప్తు జరుగుతున్న పలు కేసులు ఈడి తీసుకుందని, రాష్ట్రం నుంచి తీసుకున్న కేసుల విచారణలో పురోగతి ఎందుకు లేదని ప్రశ్నించారు. ఈడి కేసుల విచారణలో పురోగతి ఎందుకు లేదో కిషన్‌రెడ్డి చెప్పాలని కోరారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ విచారణ వేగవంతంగా సాగుతోందని, విలన్లు ఎప్పుడైనా క్లైమాక్స్‌లో అరెస్టు అవుతారని సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షనేతల ఫోన్లను తాము ట్యాపింగ్ చేయడంలేని, చేయబోమని అన్నారు. ఈడీ కేసులు నమోదు చేసినా కెటిఆర్, కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
కిషన్‌రెడ్డితో కలిసి పని చేసేందుకు సిద్ధం : తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో పర్యటిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖలు రాయడం కాదని, ప్రణాళికతో ముందుకు రావాలని సూచనలు చేశారు. కిషన్‌రెడ్డితో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
పరిష్కరించలేని అంశాలపై మళ్లీ చర్చిస్తాం : ముఖ్యమంత్రుల భేటీలో మూడు అంశాలు పరిష్కారానికి వచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు. బనకచర్ల సహా అన్ని అంశాలపై అధ్యయన కమిటీని వేశామని, కమిటీ పరిష్కరించలేని అంశాలపై అవసరమైతే ముఖ్యమంత్రులం మళ్లీ చర్చిస్తామని చెప్పారు. నదుల అనుసంధానం కోసం కేంద్రం ప్రయత్నిస్తోందని, ఇచ్చంపల్లి నుంచి కావేరికి అనుసంధించాలనే ప్రతిపాదన కేంద్రం వద్ద ఉందని అన్నారు.
బిజెపి పాలిత రాష్ట్రాల్లో రద్దు చేస్తారా : బిసిలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై తమకో వ్యూహం ఉందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2018లో కెసిఆర్ పంచాయితీ రాజ్ చట్టంలో మార్పులు చేశారని, 50శాతం రిజర్వేషన్లు వద్దని చట్టంలో మార్పులు చేశారని, 2014 ముందు 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 23 శాతానికి కుదించారని వివరించారు. రిజర్వేషన్ల కుదింపును సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చామన్నారు. ఆర్డినెన్సుపై అవగాహన లేకుండా చాలామంది మాట్లాడుతున్నారని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే ఉన్నాయని, ముస్లింలకు బిసి ఇ గ్రూపులో రిజర్వేషన్లు ఉన్నాయని, బిజెపి రాష్ట్రాల్లోనూ ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని గుర్తు చేశారు.
గుజరాత్, యూపి, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేసిన తర్వాతే కిషన్‌రెడ్డి మాట్లాడాలని రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ బిజెపి నేతలకు దమ్ముంటే గుజరాత్, యూపి, మహారాష్ట్రలో అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లను తీసివేసి తెలంగాణను తీసేయమని అడగాలని అన్నారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ తప్పక అమలు చేస్తామని, సెప్టెంబర్ 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేస్తామని పునరుద్ఘాటించారు.