Saturday, September 13, 2025

భయపెట్టిన ‘కిష్కింధపురి’

- Advertisement -
- Advertisement -

యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్, ‘చావు కబురు చల్లగా’ దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘కిష్కింధపురి’. హార్రర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? శ్రీనివాస్ కు మంచి విజయాన్నందించిందా? తెలుసుకుందాం.

కథ: కిష్కింధపురి అనే ఊరిలో ప్రేమికులైన రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్).. మైథిలి (అనుపమ పరమేశ్వరన్).. దయ్యాల పట్ల ఆసక్తి ఉన్న వారిని హాంటెడ్ హౌస్‌లకు తీసుకెళ్లి ఘోస్ట్ వాకింగ్ టూర్లు నిర్వహిస్తుంటారు. ముందే సిద్ధం చేసుకున్న సెటప్‌లతో ప్రజలను థ్రిల్ చేస్తుంటారు. అయితే కిష్కింధపురిలోని సువర్ణమాయ అనే పాడుపడిన రేడియో స్టేషన్‌కి కొందరిని తీసుకువెళ్తారు. మూత పడ్డ ఆ స్టేషన్ తలుపులు బద్దలుకొట్టుకుని వెళ్లిన ఆ బృందానికి లోపల విచిత్రమైన సంఘటన ఎదురవుతుంది. ఆ స్టేషన్‌లో అడుగుపెట్టిన 11 మంది చావడం ఖాయం అనే వాయిస్ వినిపిస్తుంది. ఆతర్వాత అక్కడికి వెెళ్లి వచ్చిన వాళ్లలో ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. దానికి కారణం అక్కడున్న విశ్రవ పుత్ర (శాండీ) అనే దయ్యం అని తెలుస్తుంది. ఇంతకీ ఆ విశ్రవ పుత్ర కథేంటి.. తనెందుకు దయ్యంగా మారాడు.. మరి ఆ దయ్యం ఆట కట్టించడం రాఘవ్, మైథిలిలకు సాధ్యమైందా లేదా అన్నది మిగతా కథ.

కథనం, -విశ్లేషణ: అసూయ, ద్వేషంతో చనిపోయిన వ్యక్తి ఆత్మ పగతో రగిలిపోతూ.. మనుషుల ప్రాణాలు తీయడానికి ఎదురుచూస్తూ ఉంటే ఎలా ఉంటుంది ? అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ యాక్షన్ హారర్ రివేంజ్ డ్రామాలో ప్రధాన కథాంశం, భావోద్వేగాలు బాగున్నాయి. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన రాఘవ పాత్ర .. ఆ పాత్రకి సంబంధించిన ఘోస్ట్ వాకింగ్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన అనుపమ పాత్ర.. ఇలా మొత్తానికి ‘కిష్కింధపురి’ సినిమా ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన బెల్లకొండ సాయి శ్రీనివాస్ తన పాత్రకు తగ్గట్లు బాగా నటించి ప్రేక్షకులను అద్భుతంగా మెప్పించాడు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అలాగే కీలక పాత్రల్లో నటించిన తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్ నటన బాగుంది.

ఇక హైపర్ ఆది, శాండీ మాస్టర్, మర్కంద్ దేశ్‌పాండే, హినా భాటియాలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. సినిమాలో దయ్యం వెనుక నేపథ్యం ఎంతో కొత్తగా రాసుకున్నారు. కథలో ట్విస్టులు ఎంతో బాగా పేలాయి. ప్రేక్షకులను ఎంతగా ఆశ్చర్యపరిచారు అన్న దాన్ని బట్టి ఆ కథ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో‘ కిష్కింధపురి’కి మంచి మార్కులే పడతాయి. ఉత్కంఠ రేపే కథనం.. కొన్ని మలుపులు కూడా తోడవడంతో ‘కిష్కింధపురి’ థ్రిల్లింగ్‌గా మారింది. ‘కిష్కింధపురి’లో ఏ దశలోనూ కథనం నెమ్మదించదు. సన్నివేశాలు రయ్యిన పరిగెడుతూనే ఉంటాయి. చివరి వరకు ట్విస్టులు కొనసాగడం.. థ్రిల్స్ కు లోటు లేకపోవడం.. భారీతనంతో కూడిన క్లైమాక్స్ ప్రేక్షకులను చూపుతిప్పుకోకుండా చేస్తాయి. రెండు గంటల పాటు ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టి థ్రిల్ చేయడంలో ‘కిష్కింధపురి’ విజయవంతమైంది.

Also Read: ఈ నెల 23న సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్టు రైలు ప్రారంభం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News