లండన్: ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీం ఇండియా ప్రస్తుతం ఆతిథ్య జట్టుతో చివరి(ఐదో) టెస్టును ఆడుతోంది. ఈ మ్యాచ్ హోరాహోరిగా సాగుతోంది. అయితే ఈ సిరీస్‌లో టీం ఇండియా ఆటగాడు కెఎల్ రాహుల్ (KL Rahul) అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు. బ్యాటింగ్‌లో 10 ఇన్నింగ్స్‌లో కలిపి 532 పరుగులు చేశాడు. మరోవైపు ఫీల్డింగ్‌లోనూ రాహుల్ సత్తా చాటుతున్నాడు. 5 మ్యాచుల్లో కలిపి 6 క్యాచులు (రెండో ఇన్నింగ్స్ కొనసాగుతోంది) అందుకున్నాడు. అయితే ఈ క్రమంలో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఓ రికార్డును రాహుల్ బ్రేక్ చేశాడు.
ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక క్యాచులు అందుకున్న భారత ఆటగాళ్ల లిస్టులో రాహుల్ (KL Rahul).. కోహ్లీని అధిగమించాడు. కోహ్లీ ఇంగ్లండ్‌లో 25 క్యాచులు అందుకోగా.. ప్రశిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో బెన్ డకెట్ క్యాచ్‌ను అందుకున్న రాహుల్ 26 క్యాచులతో కోహ్లీని దాటేశాడు. ఇక ఈ లిస్ట్‌లో రాహుల్ కంటే ముందు రాహుల్ ద్రవిడ్ (30), సునీల్ గవాస్కర్ (35) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. భారత ముందుంచిన 374 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్ ఎలా అయినా చేధించాలని పట్టుదలతో ఉంది. నాలుగో రోజు 46 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. క్రీజ్‌లో బ్రూక్(62), రూట్(40) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ఇంగ్లండ్‌కు ఇంకా 168 పరుగులు అవసరం కాగా, భారత్ ఏడు వికెట్లు తీయాలి.