హైదరాబాద్:కూటమి పాలన అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌పై జగన్ స్పందించారు. సిఎం చంద్రబాబు నాయుడు అరాచకపు, అన్యాయ పాలనపై ప్రశ్నించకుండా అధికార దుర్వినియోగానిక పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. డిబేట్ జరిగేటప్పుడు, వక్తలు మాట్లాడే మాటలకు, యాంకర్‌కు ఏం సంబంధం? అని ప్రశ్నించారు.
ప్రజల తరఫున మీడియా నిలవకూడదని సాక్షి మీడియాపైనా చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని జగన్ విమర్శలు గుప్పించారు. ‘ప్రజలు మీకు ఇచ్చిన అధికారం ఐదేళ్లు, అందులో ఏడాది గడిచిపోయింది, నాలుగేళ్ల తర్వాత మీ అన్యాయాలు, అక్రమాలకు ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుంది’ అని జగన్ హెచ్చరించారు. సాక్షి టివి యాంకర్, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. డిబేట్ లో అమరావతి మహిళలను కించపరిచిన కేసులో హైదరాబాద్ లో ఆయనను అరెస్టు చేసి ఎపికి తీసుకెళ్లారు. రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కంభంపాటి శిరీషా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.