Sunday, September 14, 2025

సింగరేణి మనుగడును ప్రభుత్వం కాపాడాలి:కొప్పుల ఈశ్వర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో ఏకైక ప్రభుత్వ రంగ పరిశ్రమగా ఉన్న సింగరేణి మనుగడును ప్రభుత్వం కాపాడాలని బిఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క సింగరేణిపై సమీక్ష చేసి, సింగరేణి కార్మిక వర్గాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడారని మండిపడ్డారు. సింగరేణి పట్ల డిప్యూటీ సిఎం భట్టికి మరింత శ్రద్ధ ఉండాలని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రాంతం పట్ల, సింగరేణి సంస్థ పట్ల ప్రేమ లేదు అని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడిన మాటలను ఆయన ఖండించారు.తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణిని కాపాడాలని కెసిఆర్ అనేక ప్రయత్నాలు చేశారని, కార్మికుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టారని తెలిపారు. దేశవ్యాప్తంగా 1400 బొగ్గు బ్లాకులను ప్రయివేటీకరణకు నిర్ణయం తీసుకున్నారని, కార్పొరేట్ సంస్థలను కాపాడటం కోసం బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేశారని చెప్పారు.

తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులన్నీ సింగరేణికి దక్కాలని కెసిఆర్ అన్నారని గుర్తు చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చాక 4 బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేశారని, 4 బొగ్గు బ్లాకులను కాపాడటం కోసం కెసిఆర్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రయత్నం చేసిందని పేర్కొన్నారు. కేంద్రంలో బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి,డిప్యూటీ సిఎం భట్టి బొగ్గు బ్లాకుల వేలం పాటలో కలిసి పాల్గొన్నారని గుర్తు చేవారు. సింగరేణిని కాపాడాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. ఒడిశాలో నైనీ బొగ్గు బ్లాకు ఎట్లా వచ్చిందని, కర్ణాటకలో కాపర్, బంగారం గనులను సింగరేణి దక్కించుకుందని సింగరేణి సంస్థ ప్రకటించిందని అన్నారు. కేంద్రంలో,రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కాంగ్రెస్ సింగరేణికి ఏం చేయలేదని విమర్శించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తెస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, సింగరేణి సంస్థలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రులు, ఎంఎల్‌ఎలు ఆధిపత్యం పెరిగి, సింగరేణి నాశనం అయ్యే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. సింగరేణి సిఎండి కాంగ్రెస్ చెప్పుచేతల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు.

సింగరేణి సంస్థ మనుగడ ప్రమాదంలో పడిందని అన్నారు. సింగరేణి మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘం సింగరేణి కార్మికుల్లో భరోసా నింపాలని పేర్కొన్నారు. నాలుగు బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు అప్పగించాలని కోరారు. తెలంగాణపై బిజెపి, కాంగ్రెస్ కక్షగట్టారని మండిపడ్డారు. సింగరేణిపై వివక్ష ఎందుకు… సింగరేణికి ఎందుకు బ్లాకులు ఇవ్వడం లేదని కొప్పుల ఈశ్వర్ నిలదీశారు.

Also REad: 200 రోజులు గడిచినా మృతదేహాలు వెలికితీయరా..?:కెటిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News