నా నగరం అందాలు ఆరబోయ
పలు రాజ్యాల అందగత్తెలకి
స్వాగతం పలుకుతుంది
దేహాలన్నీ ఒక్కటే
అంగాంగాల ధర్మాల్లో తేడా వుండదు
మందులు, సూదులు, శస్త్రచికిత్సలతో
పరిమితుల్లోకి కుంచించబడ్డ కొలతల్లో
చిక్కిన అందానికే కిరీటం
చూసే చూపుల్లో అందం ప్రతిబింబిస్తుంది
చూపు, చూపుకు మారే అందాన్ని న్యాయనిర్ణేతలు
కాగితంపై మార్కుల పట్టికలతో
ప్రపంచ పటంపై ఆమెను చిత్రించగానే
పెట్టుబడి జుర్రుకుంటుంది
వెచ్చించిన ధనం పర్యాటకంలో
కొల్లగొట్ట రాజ్యం చూస్తుంది
బజారోడు కాపు కాస్తున్నాడు
అంగట్లో అమ్మకానికే ఆమె అనేది
ఈ తంతు కార్య అంతిమ లక్ష్యం
నాగార్జునుడు నడయాడిన నేలలో
అందాల బొమ్మల సంచారంతో
ప్రపంచం దృష్టిలోననే హ్రస్వ దృష్టి
వేల ఏళ్ళ కింద ఈ నేలలో విశ్వవిద్యాలయం
బౌద్ధం విరాజిల్లిన శ్రీ పర్వతం
అబద్దాలే చరిత్రగా చలామణి అవుతున్న
నేటి రాజ్యంలో
చెరపలేని చరిత్ర విజయపురిదే
మదనికల, నాగినుల శిల్పకళా వైభవాన్ని
ప్రపంచానికి చాటిన
తేలే ఇటుకల నిర్మాణం రామప్ప సొంతం
రంకెవేయ సిద్ధంగానున్న నంది
ఆమెల కృత్రిమ వయ్యారి నడకలజూచి
చిన్నబోయింది
లోకమెరిగిన రామప్పని వీళ్లు
పరిచయం చేసుడేంది?
లక్నవరం తీగల వంతెన వీణలా ధ్వనించేనా?
చెర్ల చేప బెస్తకి దక్కేనా?
ఎల్లలు ఏనాడో దాటిన పోచంపల్లి ఇక్కత్
అందాల సుందరులు కట్టుకునే సరుకై అమ్ముడు
పోతుందనే కల్లబొల్లి కబుర్ల దళారీల రాజ్యంలో
మోసపోవడం సాలెన్నకేం కొత్త కాదులే
కట్టుకున్న చీరలతో వాళ్లంతా
యాదగిరి నరసన్న చెంత
సేద తీరితే నల్లగొండ ఫ్లోరోసిస్ కష్టాలు తీరేనా!
పిల్లలమర్రి మానెక్కడో తెలియదు
పాలమూరు వలస గోస తీరేదెన్నడో తెలియదు
ఇప్పుడు వీళ్లు ఊడల ఉయ్యాలలూగితే
పాలమూరు యాతన తీరేనా? నీరు దక్కేనా?
ఈ సుందరాంగుల అందాలు కాదిక్కడ కావాల్సింది
కొంగు నడుముకి చుట్టిన ఐలమ్మ, సమ్మక్క,
సారక్కల తెగువ కావాలే
గీతాలై నేల నేలంతా నిండిపోయిన ఎర్రని మోదుగు పూల వారసత్వం
బాహ్య ప్రపంచానికి తెలియాలని
తెలంగాణాదేనని
ఓ సారి అక్కడికి తీసుకెళ్ళి
బిగిపిడికిళ్ల బలం ఏమిటో తెలుస్తుంది
ఈ అందాలన్నీ
చేపల బుట్టలు మోయాలే
కల్లు ముంతలు కుదురు కట్టి
ఆమడ మోయాలే, చెర్ల బట్టలుతకాలే
అప్పుడు కదా ఈ నేలన
జరిగిన దగా విశ్వాన్ని చుట్టి వచ్చేది
ఎన్నాళ్ళని దాస్తావు
నిప్పు పొగ చుట్టేస్తూనే ఉంటుంది
తూర్పున ఎరుపు కదా, అసలు సిసలైన అందం
గిరి ప్రసాద్ చెలమల్లు