రైతులను అరి గోస పెడుతున్న యూరియా బస్తానే కాంగ్రెస్ ప్రభుత్వంకు ఉరితాడుగా మారుతుందని దుబ్బాక ఎంఎల్‌ఎ కొత్త ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. యూరియా సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా సిద్దిపేట జిల్లా, దుబ్బాక నియోజకవర్గం, అక్బర్‌పేట-=భూంపల్లి చౌరస్తాలో మంగళవారం రైతులతో కలిసి ఆయన రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయి తెలంగాణ కు చేసిందేమీ లేదని, ఢిల్లీకి డబ్బు సంచులు మాత్రం పంపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నుండి ఢిల్లీకి డబ్బు సంచులు పంపుతున్న వారికి ఢిల్లీ నుండి యూరియా సంచులు తెచ్చే సోయి లేదని ఎద్దేవా చేశారు. ఎక్కడ చూసినా లారీ యూరియా వస్తే 2 వేల మంది రైతులు లైన్ కడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కెసిఆర్ హయాంలో పదేళ్లలో రాని యూరియా కొరత నేడు ఎందుకు వస్తోందని, కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాల చేతగానితనంతోనే కదా అని ప్రశ్నించారు. తెలంగాణలో రైతులు యూరియా కోసం పోరాటం చేస్తుంటే రాష్ట్రంలోని బిజెపి, కాంగ్రెస్ చెందిన ఎనిమిది 16 మంది ఎంపిలు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లాలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయని, వందల కిలోమీటర్ల కాల్వలు ఉన్నాయని, మరి ప్రాజెక్టులలో నీళ్లు ఎన్నున్నాయి, పెద్ద,
చిన్న కాలువల పరిస్థితి ఏంది? సాగు చేసుకున్నారా? వీటి గురించి నీటిపారుల శాఖ మంత్రి ఇంతవరకు సమీక్ష నిర్వహించలేదంటే ఆయనకు రైతులపై ఎంత ప్రేమ ఉందో అర్థమైతుందని వ్యాఖ్యానించారు. దుబ్బాక నియోజకవర్గంలో ఫ్యాక్టరీలు లేవని, ఎవుసం మీదనే ఆధారపడుతుంటారని, ఈ పరిస్థితుల్లో రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు రైతులు యూరియా కోసం వానల్లో ఎండల్లో కష్టపడుతుంటే ధర్నాలు చేస్తుంటే పరిష్కరించాల్సిన కాంగ్రెస్ నాయకులు రెయిన్ డాన్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ హయాంలో రైతులు రోడ్డు మీదికి వచ్చిన దాఖలు లేవని, నేడు రేవంత్ సర్కార్ పుణ్యమా రైతులు రోడ్డు మీద ధర్నాలు, ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.. ఈ సందర్బంగా కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్షం పడుతున్నా ఎంఎల్‌ఎ కొత్త ప్రభాకర్ రెడ్డి రైతులు, బిఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి గంట పాటు ఆందోళన కొనసాగించారు. పోలీసులు రాస్తారోకో చేస్తున్న ఎంఎల్‌ఎను, రైతులు, బిఆర్ ఎస్ శ్రేణులను బలవంతంగా విరమింపజేశారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.