అశ్వారావుపేట పట్టణం, మంగళిగూడెంకు చెందిన కొయ్య కావ్య ఉపాధి కోసం ఒమన్ దేశం మస్కట్ కు వెళ్లి వెట్టిచాకిరి కూపంలో ఇరుక్కుంది. తనను భారత్‌కు రప్పించాలని అధికారులను వేడుకోంటుంది. వివరాల్లోకి వెళితే….. ఇతర దేశాల్లో ఇంటి పని చేసినా ఊహకందని సంపాదన దొరుకుతుందంటూ ఏజెంట్ మాటలు నమ్మి మోసపోయింది కావ్య. ఒమన్ దేశ రాజధాని మస్కట్‌లో ఓ ఇంట్లో పని మనిషి పోస్ట్ ఉందంటూ ఏపీకి చెందిన ఏజెంట్ వెంకట లక్ష్మీ కావ్యకి మాయమాటలు చెప్పింది. తండ్రి లేక కుటుంబ పోషణ భారం తనపైన పడటంతో ఏజెంట్ మాటలు నమ్మి కోచింగ్ కు వెళుతున్నానని ఇంట్లో చెప్పి మూడు నెలల క్రితం కావ్య ఒమన్ వెళ్ళింది. కావ్యను ఒమన్ కు రప్పించేందుకు ఏజెంట్ వెంకట లక్ష్మికి 3 లక్షలు చెల్లించింది.
కాని అక్కడ యజమానులు మాత్రం రోజుకు 18 గంటలు పనిచేయిస్తూ కావ్యతో వెట్టిచాకిరి చేయిస్తున్నారు. చెప్పిన ప్రకారం వేతనాలు చెల్లించక వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆ యువతి ఆవేధన వ్యక్తం చేసింది. బహుళ అంతస్థుల భవనాల్లో కావ్యతో వెట్టిచాకిరి చేయించడంతో రోజుల వ్యవధిలోనే అనారోగ్యం బారిన పడింది కావ్య. దీంతో అక్కడి యజమానులు కావ్యకు ప్రాథమిక చికిత్స జరిపించి వెట్టిచాకిరి కూపంలో మళ్లీ దించారు. ఒకే ఇంట్లో పని ఉంటుందని చెప్పి బిల్డింగ్ లోని అన్ని ఇళ్లల్లో కావ్యతో వెట్టిచాకిరి చేయిస్తున్నారు. తానింక చాకిరి చేయలేనని తన ఆరోగ్యం క్షీణించిందని భారత్ కు రప్పించాలని ఏజెంట్ వెంకట లక్ష్మిని కావ్య వేడుకుంది. డబ్బులు ఊరికే రావని భారత్ కు రప్పించాలంటే తనకు మూడు లక్షలు చెల్లించాలంటూ ఏజెంట్ డిమాండ్ చేసింది. తన వద్ద డబ్బులు లేకే ఈ పనికి చేరానని భారత్ కు రాగానే ఉన్నవన్ని అమ్మైనా బాకీ తీరుస్తానని స్వదేశానికి రప్పించాలని కావ్య ఏజెంట్ ను వేడుకుంది.
తరచూ కావ్య కాల్ చేస్తుండటంతో ఏజెంట్ పోన్ నంబర్ మార్చేసింది. వెట్టిచాకిరి వేధింపులు భరించలేక ఒమన్ లోని భారత ఎంబసీకి కాల్ చేసి ఫిర్యాధు చేసింది కావ్య. ఎంబసీతో కావ్య కాల్ సంభాషణను తెలుసుకుని యజమానులు మరింత వేధింపులకు దిగారు. పని గంటలు పెంచి చిత్రహింసలు పెడుతున్నారు. మస్కట్ లో యజమానుల చిత్రహింసలు భరించలేక సెల్ఫీ వీడియో తీసి కావ్య స్నేహితులకు పంపింది. తన ఆరోగ్యం బాగోలేదని పని వేధింపులు తాళలేక ఇక్కడే చచ్చిపోయేలా ఉన్నానంటు కావ్య కన్నీంటి పర్యాంతమవుతోంది. కావ్య తల్లి కన్నబిడ్డ మస్కట్ లో పడుతున్న కష్టం తెలుసుకుని తల్లడిల్లిపోతుంది.