హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా భారీ వర్షాల కారణంగా ఓవైపు ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్నా.. మరోవైపు జలాశయాలు మాత్రం జలకళను సంతరించుకుంటున్నాయి. నాగార్జన సాగర్ (Nagarjuna Sagar) కూడా నీటితో నిండిపోయింది. శ్రీశైలం జలాశయం నుంచి వచ్చిన నీటి ప్రవాహంతో నాగార్జున సాగర్‌కు భారీగా నీరు వచ్చి చేసింది. దీంతో సాగర్ కృష్ణమ్మ పరవళ్లతో కళకళలాడుతుంది. ఈ సీజన్‌లో సాగర్‌కు 4.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడం ఇదే తొలిసారి. దీంతో అధికారులు మొత్తం 26 గేట్లను దాదాపు 10 అడుగుల పైకి ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇలా జరిగడం కూడా సాగర్ చరిత్రలో తొలిసారి కావడం విశేషం.
గడిచిన మూడు రోజుల నుంచి వరద ప్రమాదం పెరుగుతుండటంతో నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) నీటిమట్టం అంతకంతకు పెరిగిపోతుంది. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ఇప్పటికే 584.80 అడుగులుగా నమోదైంది. నీటి నిల్వ సామర్థ్యం 312,0450 టిఎంసిలు కాగా.. ప్రస్తుతం 274,8580 టిఎంసిలుగా ఉంది.