కాంగ్రెస్ సర్కార్‌కు ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ తవ్వడం చేతకాదు.. సుంకిశాల రిటైనింగ్ వాట్ సరిగ్గా కట్టించే తెలివి లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. చివరికి ఓ చెక్ డ్యూమ్ కూడా నిర్మించలేని కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టుపై మాత్రం బురద జల్లడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌లోని అడ్డాకుల మండలం గుడిబండ పెద్ద వాగుపై కాంగ్రెస్ కాంట్రాక్టర్ నిర్మించిన చెక్ డ్యామ్ రెండు నెలల్లోనే ఎందుకు కొట్టుకుపోయిందో సిఎం రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాసిరకం పనులు చేసి రైతుల పొలాలు, మోటర్ పైప్ లైన్లు, చివరికి ట్రాన్స్‌ఫార్మర్ కూడా కొట్టుకుపోయే దుస్థితికి కారణమైన ప్రతి ఒక్కరిపై సర్కారు చర్య తీసుకుని బాధితులను ఆదుకోవాలని అన్నారు. ప్రాజెక్టుల మాట దేవుడెరుగు చివరికి ఒక్క ఇటుక కూడా సరిగా పేర్చలేని ఈ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సర్కారు ముక్కు నేలకు రాసి మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టుపై నోరు పారేసుకోమని లెంపలేసుకోవాలని పేర్కొన్నారు.
శాంతిభద్రతల క్షీణతపై కెటిఆర్ ఆగ్రహం
కాంగ్రెస్ పాలనలో ప్రజా భద్రతకు ముప్పు పొంచి ఉందని కెటిఆర్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. కేవలం వారం రోజుల్లో రెండు షాకింగ్ నేరాలు జరిగాయని అన్నారు. జ్యువెలరీ షాపులో పగటిపూట గన్‌పాయింట్ దోపిడీ, కూకట్‌పల్లిలో 12 ఏళ్ల బాలిక దారుణ హత్య ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పారు. శాంతిభద్రతల పైన రాష్ట్ర ప్రభుత్వం కనీసం దృష్టి సారించకపోవడం, సమర్థవంతమైన తెలంగాణ పోలీసులను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవడంతోనే ఈ దుస్థితి అని అగ్రహం వ్యక్తం చేశారు. పౌరులకు భద్రత కావాలి, భయం కాదు అని పేర్కొన్నారు.