హైదరాబాద్: అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరుగుతుందని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ (KTR) అన్నారు. మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఎన్నికలో విజయం సాధించాలని బిఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ పార్టీ కార్యకర్తలతో కెటిఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీ మెజారిటీతో బిఆర్ఎస్ గెలుపే గోపీనాథ్‌కు సరైన నివాళి అని అన్నారు.
‘‘ఓటుకు రూ.5 వేలు పంచితే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. సిఎం సోదరుడు చెరువులో ఇళ్లు కట్టానా హైడ్రా పోదు. ఉపఎన్నిక కోసం సర్వేలు చేయిస్తున్నాం.. పార్టీ పరిస్థితి బాగుంది. అందరూ కలిసికట్టుగా పనిచేసి బిఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలి. ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు ఉంటే తొలగించాలి.. లేని వారివి చేర్చాలి. ఓట్లు వేయకపోతే సంక్షేమ పథకాలు బంద్ చేస్తామని.. ఇళ్లు కూలుస్తామని అంటారు. పేదలకు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ, మూసీ ప్రాజెక్టుకు డబ్బులు ఉన్నాయట. కెసిఆర్ మళ్లీ సిఎం కావాలంటే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సత్తా చూపాలి. జూబ్లీహిల్స్ నుంచి బిఆర్ఎస్ జైత్రయాత్ర మళ్లీ ప్రారంభం కావాలి’’ అని కెటిఆర్ (KTR) పేర్కొన్నారు.
Also Read : కంటోన్మెంట్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత