హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మరోసారి సవాల్ విసిరారు. తెలివిలేక కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటున్న సిఎం.. కూలిందంటున్న మేడిగడ్డ బరాజ్ మీదనే చర్చ పెడదాం…అంటూ సవాల్ విసిరారు. దమ్మంటే రేవంత్ రెడ్డి తాము విసిరిన సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. గతంలో చర్చకు రా అని సవాలు విసిరి.. మూడు రోజులు సమయం ఇచ్చి మరీ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు వెళితే రేవంత్ రెడ్డి పారిపోయారని ఎద్దేవా చేశారు. చర్చకు వస్తవా.. అని పిలిచి పారిపోయిన పిరికిసన్నాసి రేవంత్ రెడ్డి అని ఘాటుగా విమర్శించారు. ఇప్పుడు మరొకసారి చర్చకు వస్తావా అని రేవంత్ రెడ్డి అడుగుతున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ భవన్‌లో బుధవారం దళిత బంధు సాదన సమితి సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ…నాగార్జునసాగర్ కట్టపైన చర్చకు వస్తావా.. అని సిఎం సవాల్ విసిరారని, నాగార్జునసాగర్ కట్టమీద కాదు కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద చర్చకు రావాలని సవాలు విసురుతున్నామని చెప్పారు. ఇప్పటికే తమ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మేడిగడ్డ బరాజ్ వద్దకు వెళ్లి వచ్చి మరి ఈ మేరకు సవాల్ విసిరారని, దమ్ముంటే ముఖ్యమంత్రి మేడిగడ్డ బరాజ్ మీద చర్చకు తాము విసిరిన సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గం చివరి మడి వరకు నీళ్లిచ్చిన నాయకుడు కెసిఆర్ అని రేవంత్‌కు తెలిసి కూడా ఆయన అబద్దాలు మాట్లాతున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి పదేపదే దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సిఎం తనను దొంగ లెక్క చూస్తున్నారని పదేపదే మాట్లాడుతున్నారని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే ఏం చేస్తారో చేసుకోండి… నన్ను కోసుకు తింటారా అంటూ రేవంత్‌రెడ్డి రంకెలు వేస్తున్నారన్నారని మండిపడ్డారు.