తనపై పెట్టిన ఫార్ములా-ఈ కేసు ఒక లొట్టపీసు కేసు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మరోసారి చెప్పారు. ఈ విషయంలో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం అని, సిఎం రేవంత్‌రెడ్డి లై డిటెక్టర్ పరీక్ష సిద్ధమా అంటూ సవాలు విసిరారు. ఈ పరీక్షతో ఎవరు ఏమిటో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. హైదరాబాద్‌కి ఫార్ములా- ఈ రేసు తీసుకురావడానికి తాను అన్ని ప్రయత్నాలు చేశానని చెప్పారు. ఈ రేసు కోసం ప్రభుత్వం నుండి రూ. 46 కోట్లు ఇవ్వాలని తానే ఆదేశాలు ఇచ్చానని, ఆ డబ్బులు నేరుగా నిర్దేశిత ఖాతాలోకి చేరాయని తెలిపారు.
ఇందులో రూపాయి కూడా ఎక్కడా తారుమారు కాలేదని, ప్రతి రూపాయికి లెక్క ఉందని అన్నారు. అలాంటప్పుడు అవినీతి ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రాసిక్యూషన్ చేసినా, ఛార్జిషీట్లు వేసినా ఏమీ చేయలేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, గ్యారెంటీలపై పోరాడుతామని పునరుద్ఘాటించారు. గతంలో రూ. 50 లక్షల నోట్ల కట్టలతో కెమెరాలకు అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి గురించి కూడా ప్రజలు తెలుసుకుంటారని అన్నారు. ప్రజల సమస్యల నుండి దృష్టి మళ్లించడానికి ప్రభుత్వం ఫార్ములా-ఈ కేసును ముందుకు తెచ్చిందని ఆరోపించారు. కానీ తాము మాత్రం ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని కెటిఆర్ స్పష్టం చేశారు.