Friday, August 22, 2025

చేతగాని పాలకుల వల్ల యూరియా సంక్షోభం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

రైతులను అరిగోస పెడుతున్న ప్రస్తుత కాంగ్రెస్ పాలకుల పతనం ప్రారంభమైందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. రైతులకు యూరియా సరఫరాలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్థ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరిపాలన అంటే ఏమిటో తెలియని అసమర్థులు రాజ్యమేలడం వల్లే రైతులకు ఈ కష్టాలు, కన్నీళ్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ నాయకత్వం, ముందుచూపు, పకడ్బందీ పాలన అంటే ఏమిటో ఇప్పుడు తెలంగాణ సమాజానికి అర్థమైందని కెటిఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూరియా సంక్షోభం పైన ఆయన స్పందిస్తూ, చిల్లర రాజకీయాలు తప్ప పరిపాలన తెలియని అసమర్థులు రాజ్యమేలడం వల్లే రైతులకు ఈ కష్టాలు, కన్నీళ్లు వచ్చాయని ధ్వజమెత్తారు. ఒకవైపు బూతులు మాట్లాడడం తప్ప చేతలు రాని ఢిల్లీ పార్టీల నాయకులకు, మరోవైపు వందేళ్ల విజన్‌కు నిలువెత్తు రూపమైన కెసిఆర్‌కు ఉన్న స్పష్టమైన తేడా నాలుగు కోట్ల తెలంగాణ సమాజానికి ఇప్పుడు అర్థమైపోయిందని వ్యాఖ్యానించారు.

గతంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో యూరియాను సకాలంలో తెప్పించడానికి ఎన్నెన్ని ప్రణాళికలు, కసరత్తులు జరిగాయో ఆయన వివరించారు. వ్యవసాయ అధికారులతో కెసిఆర్ వరుస సమీక్షలు నిర్వహించేవారని, కేంద్రానికి ప్రతి సీజన్‌కు ముందే లెక్కలతో సహా వినతులు సమర్పించేవారని గుర్తు చేశారు. అంతేకాకుండా, ఎసిలోని నౌకాశ్రయాలకు మన అధికారులను పంపి, సరఫరాను పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేసేవారని తెలిపారు. యూరియా సరఫరా కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులకు స్వయంగా కెసిఆర్ ఫోన్ చేసి, 25 స్పెషల్ గూడ్స్ ట్రెయిన్‌లను ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తులు చేసేవారని పేర్కొన్నారు. అవసరమైతే పక్క రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో నేరుగా సంప్రదింపులు జరిపి, ఏకంగా 4 వేల లారీలను రంగంలోకి దించేలా సన్నాహాలు చేసేవారని తెలిపారు. పోర్టుల నుంచి నేరుగా మండలాలకు యూరియాను తరలించే వ్యూహాలను రచించి, ప్రతి రైతుకు సమయానికి అందేలా చర్యలు తీసుకునేవారని చెప్పారు.

యూరియా సరఫరాలో ఏ ప్రాంతంలోనూ కొరత రాకుండా, నేరుగా గ్రామాల్లోనే సరఫరా చేసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసేవారని అన్నారు. కెసిఆర్‌కు ఉన్న ఈ ముందుచూపు, దక్షత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం రైతులను కష్టాల పాలు చేస్తోందని ఆరోపించారు. పరిపాలనలో కెసిఆర్‌కు ఉన్న అనుభవం, స్పష్టత ప్రస్తుత పాలకులకు లేవని, అందుకే రైతులు ఇబ్బందులు పడుతున్నారని కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News