నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జిషీట్‌లో సిఎం రేవంత్‌రెడ్డి పేరు
ఉండడం తెలంగాణ సమాజానికే అవమానకరం యావత్తు
దేశం ముందు రాష్ట్రం పరువు తీశారు ఛార్జిషీట్‌లో రేవంత్
పేరున్నా బిజెపి మౌనం వహించడం దేనికి నిదర్శనం రాష్ట్ర
బిజెపి ఎంపిలు కాంగ్రెస్ సర్కార్‌తో కుమ్మక్కయ్యారు రేవంత్
అవినీతిపై నెలరోజులలోగా కేంద్రం స్పందించకపోతే ప్రత్యక్ష
కార్యాచరణ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: నైతికత, నిజాయితీ ఉంటే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డి మాండ్ చేశారు. నెషనల్ హెరాల్డ్ ఛార్జ్‌షీట్‌లో రేవంత్ రెడ్డి పేరు ఉండడం తెలంగాణకే అవమానకరమన్నారు. రేవంత్ రెడ్డి ఒక లొట్ట పీసు సిఎం అని ప్రజలకు అర్థమైపోయిందని విమర్శించారు. కర్ణాటకలో డికే శివకుమార్‌ను అక్కడి బిజెపి నేతలు విమర్శిస్తుంటే తెలంగాణ బిజెపి నేతలు రేవంత్ రెడ్డిని పల్లెత్తు మాట అనకపోవడం ఆ రెండు పార్టీల మధ్య ఉన్న అపురూప సంబంధానికి నిదర్శనమని ఆరోపించారు.2020లో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప హౌసింగ్ స్కామ్‌లో ఉన్నట్టు వార్తలు వస్తే నిష్పక్షపాతంగా వి చారణ జరగాలంటే రాజీనామా చేయాలని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు అప్ప ట్లో డిమాండ్ చేశారని గుర్తు చేశారు.
అవినీతి ఆరోపణలు వస్తే గతంలో ఎందరో కేంద్ర మంత్రులు రాజీనామా చేశారని చెప్పారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా పదవి నుండి స్వఛ్చందంగా తప్పుకోవాలని అన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సిఎం రేవంత్ రెడ్డి పేరు ఉండటం తెలంగాణ సమాజానికే అవమానమని అన్నారు. యావత్ దేశం ముందు తెలంగాణ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసు రేవంత్‌కు సీటుకు రూట్ కుంభకోణం అని విమర్శించారు. ఓటుకు నోటు కుంభకోణం ఇంకా ఎవరూ మర్చిపోలేదని.. యంగ్ ఇండియా పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. రూ.50 కోట్లు ఇచ్చి రేవంత్ రెడ్డి పిసిసి పదవి కొనుక్కున్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ఆనాడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ఆరోపణలకు, ఇప్పుడు చార్జిషీట్‌తో ఇడి ఆధారాలు చూపించిందన్నారు. రేవంత్‌కు బ్యాగ్‌మాన్ అనే పేరు ఎప్పుడో వచ్చిందని పేర్కొన్నారు. ఎవరు డబ్బులు ఇచ్చారు, ఏ పొజిషన్‌ని అమ్ముకున్నారు, ఎన్ని డబ్బులు ఇచ్చారు అన్న వివరాలను ఇడి తన చార్జిషీట్లో స్పష్టంగా బయటపెట్టిందని తెలిపారు. ఢిల్లీ కాంగ్రెస్‌కు తెలంగాణ ఎటిఎంలా మారిందని అన్నారు.
ఢిల్లీ కాంగ్రెస్‌కు ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు భారీ మొత్తంలో అందిస్తూ రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకుంటున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ఎంఎల్‌ఎ అని, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అని, యావద్దేశం ముందు తెలంగాణ పరువు తీశారని మండిపడ్డారు. రేవంత్ మాటలు, మూటల ముఖ్యమంత్రి అంటూ దుయ్యబట్టారు. మూటలు పంచి రేవంత్ తన పదవిని కాపాడుకుంటున్నారని.. తనని తాను కాపాడుకునేందుకు ఢిల్లీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌కు ఢిల్లీలో ఇద్దరు బాస్‌లు ఉన్నారని.. ఒకరు రాహుల్ గాంధీ.. మరొకరు మోదీ అని చెప్పారు. రేవంత్‌రెడ్డికి రాహుల్ గాంధీ అఫీషియల్ బాస్ అయితే నరేంద్ర మోడీ, అమిత్ షాలు రేవంత్ రెడ్డికి అనఫిషియల్ బాసులు అని విమర్శించారు. 17 నెలల్లో 44 సార్లు ఢిల్లీ వెళ్లి అరుదైన రేవంత్‌రెడ్డి రికార్డ్ సాధించారంటూ ఎద్దేవా చేశారు. చీకట్లో అమిత్‌షా కాళ్లు పట్టుకున్నారని.. అరెస్ట్ చేయొద్దని ఇడికి చెప్పాలని వేడుకున్నారని కెటిఆర్ ఆరోపించారు. నిజాయితీ ఉంటే సిఎం పదవి నుంచి రేవంత్ తప్పుకోవాలని.. లేదంటే ఢిల్లీ పెద్దలే రేవంత్‌ను తప్పించాలని డిమాండ్ చేశారు. అవినీతి సిఎంను ఎందుకు కొనసాగిస్తున్నారో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో బిజెపి కుమ్మక్కు అయిందని ఆరోపించారు.
బిజెపికి నిజాయితీ ఉంటే తెలంగాణలో స్కామ్‌లపై స్పందించాలి
ఇడి చార్జ్‌షీట్‌లో రేవంత్ పేరున్నా బిజెపి ఎందుకు స్పందించడం లేదని కెటిఆర్ నిలదీశారు. తెలంగాణ బిజెపి ఎంపీలు చేస్తున్న భూదందా అక్రమాలకు రేవంత్ రెడ్డి వత్తాసు పలుకుతున్నందుకే మౌనమా..? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులతో కలిసి తెలంగాణ బిజెపి నేతలు చేస్తున్న అవినీతి కార్యకలాపాలకు రేవంత్ సపోర్ట్ చేస్తున్నందుకే మౌనం వహిస్తున్నారా..? అని నిలదీశారు. బిజెపికి నిజాయితీ ఉంటే తెలంగాణలో స్కామ్‌లపై స్పందించాలని అన్నారు. తెలంగాణలో స్కామ్‌లపై కేంద్ర ఏజెన్సీలు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.తెలంగాణలో ఆర్‌ఆర్‌ఆర్ ట్యాక్స్ నడుస్తోందని ప్రధాని మోదీనే చెప్పారని.. ఆర్‌ఆర్‌ఆర్ ట్యాక్స్‌పై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
బిజెపి, కాంగ్రెస్ రెండూ అవగాహనతో నడుస్తున్నాయని ఆరోపించారు. పొంగులేటి ఇంట్లో ఇడి తనిఖీలు జరిగి ఏడాది అయిందని.. తనిఖీల వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలను బిజెపి నేతలు ఎందుకు కాపాడుతున్నారని అడిగారు. వాల్మీకి స్కాంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రూ.45 కోట్లు వచ్చాయని.. ఈ స్కాంలో నిందితులపై చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక్క ఇటుక పేర్చకుండానే, ఒక కొత్త ప్రాజెక్టులు కట్టకుండానే, ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండానే, ఒక్క హామీని అమలు చేయకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష 80 వేల కోట్ల అప్పు చేసిందని,ఈ డబ్బులు అన్ని ఎక్కడికి పోతున్నాయో ఇప్పుడైనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. బిఆర్‌ఎస్‌పై నిందలు.. బిల్డర్లు -కాంట్రాక్టర్లతో దందాలు…ఢిల్లీ బాస్‌లకు వేలకోట్ల చందాలు.. సంవత్సర కాలం నుంచి రేవంత్ రెడ్డి చేస్తున్నది ఇదే అంటూ ఆరోపణలు చేశారు.
రేవంత్‌రెడ్డి అవినీతిపై రాహుల్‌గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు
దేశంలోని అన్ని విషయాలపై మాట్లాడే రాహుల్ గాంధీ తన పార్టీ ముఖ్యమంత్రి చేస్తున్న ఈ అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదని కెటిఆర్ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని కాపాడాలి అని దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీ సిఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అవినీతి బాగోతాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడి ఛార్జ్ షీట్లో చేర్చినప్పుడు దేశంలోని ప్రతి కాంగ్రెస్ నాయకుడు స్పందించారని, కానీ ఒక రేవంత్ రెడ్డి మాత్రం జపాన్ పర్యటన పేరుతో తప్పించుకొని ఇప్పటిదాకా ఆ విషయంపై మాట్లాడడం లేదని చెప్పారు. 187 కోట్ల వాల్మీకి స్కామ్‌లో కర్ణాటకలో అరెస్టులు జరిగాయని, అందులో 45 కోట్లు తెలంగాణకు బదిలీ అయ్యాయని చెప్పారు.
ఆ 45 కోట్లు అందుకున్న కాంగ్రెస్ నాయకుల పేర్లు ఇప్పటిదాకా బయటికి రాలేదని, వాళ్లను విచారించాలని ఇప్పటిదాకా ఇడి అనుకోలేదని అన్నారు. 45 కోట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చేరాయని రిమాండ్ డైరీలో ఇడి రాసిందని, ఆ డబ్బులను లోక్ సభ ఎన్నికల ప్రచారానికి వాడారు అని స్పష్టం చేసిందని తెలిపారు. కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కుతో వాల్మీకి స్కాం కూడా బ్రహ్మ రహస్యంగానే మిగిలిపోయిందని అన్నారు. ప్రతిపక్ష నేతలపై మెరుపు వేగంతో స్పందించే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు ఇక్కడ కాంగ్రెస్ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎవరు ఎవరితో కుమ్మక్కవుతున్నారో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.
కొన్ని పత్రికలు రేవంత్‌రెడ్డి పేరునే రాయలేదు
నేషనల్ హెరాల్డ్ కేసులో సిఎం రేవంత్‌రెడ్డి పేరు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నా కొన్ని పత్రికలు వార్తనే రాయలేదని కెటిఆర్ అన్నారు. అదే కెసిఆర్ పేరు ఉంటే ఆ పత్రికలు రాయకుండా ఉండేవా..? అని ప్రశ్నించారు. కోతికి కొబ్బతిచిప్ప దొరికినట్లు సంబురాలు చేసుకుంటూ తాటికాయంత అక్షరాలతో వార్తలు రాసేవారని అన్నారు. కానీ ఇప్పుడు రేవంత్‌రెడ్డిని కవర్ చేసేందుకు కష్టపడి కాపాడుతున్నారని ఆరోపించారు. ప్రకటన కోసం మీడియా సంస్థలు ఎన్ని విషయాలు దాచినా సోషల్ మీడియా ద్వారా ప్రజలు వాస్తవాలు తెలుస్తూనే ఉంటాయని చెప్పారు. మీడియా సంస్థలు నిష్పక్షపాతంగా ప్రజలు విషయాలు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. సిఎం రేవంత్‌రెడ్డి ఫ్రస్టేషన్‌లో ఏదేదో చేస్తుంటారు..లీకులు ఇచ్చి, ఏదో రకంగా మీడియా మేనేజ్‌మెంట్ చేస్తుంటారని పేర్కొన్నారు.
కేంద్రానికి నెల రోజుల డెడ్‌లైన్
నేషనల్ హెరాల్ కేసులోనైనా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్పందిస్తుందో లేదో వేచి చూస్తామని కెటిఆర్ అన్నారు. నెలరోజుల్లోగా రేవంత్ అవినీతిపై స్పందించకపోతే ప్రత్యక్ష కార్యచరణకు దిగుతామంటూ కెటిఆర్ కేంద్రానికి డెడ్‌లైన్ విధించారు. రాష్ట్ర గవర్నర్‌ను కలిసి విచారణ కోరతామన్నారు.బిజెపిని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల ముందు ఎండగడతామని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి పథకంలో ఎలాంటి అవినీతి జరగలేదని, సిబిఐ దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పిందని తెలిపారు. సొంత పార్టీ ఎంఎల్‌ఎలు, మంత్రులే 30 శాతం కమిషన్ ఇవ్వండి ఏ పని జరగదని బహిరంగంగానే చెబుతున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి మామ కాళేశ్వరంలో అవినీతి ఎక్కడిదని మీడియా ముందు ప్రశ్నిస్తున్నారని అన్నారని తెలిపారు.