Thursday, July 17, 2025

వారికి వెంటనే దళితబంధు ఇవ్వాలి: కెటిఆర్ డిమాండ్

- Advertisement -
- Advertisement -

గత ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రతి ఒక్క దళిత బిడ్డకు బంధు వెంటనే ఇవ్వాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. దళితబంధుపై పెట్టిన ఫ్రీజింగ్‌ను వెంటనే తొలగించి, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా 12 లక్షల రూపాయల దళితబంధు ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి పార్టీ తరఫున లేఖ రాయనున్నట్లు తెలిపారు. దళితబంధు సాధన సమితి ప్రతినిధులు బుధవారం కెటిఆర్‌ను కలిసి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దళితబంధు లబ్ధిదారులకు కావాలనే నిధులు అందకుండా ఆపివేస్తుందని, ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ దళితబంధు సాధన సమితిని ఉద్దేశించి మాట్లాడారు.

కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం దళితబంధు కాదు అని, దళిత జీవితాల్లో సంపూర్ణ సమగ్ర మార్పులకు తీసుకురావడం కోసం చేపట్టిన కార్యక్రమం అని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షలకు అదనంగా మరో రెండు లక్షలు కలిపి 12 లక్షలు ఇస్తామని చెప్పి దళితుల ఓట్లు వేయించుకొని వారిని ప్రస్తుతం మోసం చేస్తోందని ఆరోపించారు. దేశ చరిత్రలో దళితబంధు, రైతుబంధు వంటి కార్యక్రమాలను కెసిఆర్ వంటి దమ్మున్న నాయకులు మాత్రమే చేయగలరని పేర్కొన్నారు. దళితబంధు వల్ల వందలాది మంది దళిత కుటుంబాల్లో వెలుగులు నిండాయని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దళితులను అడుగడుగునా మోసం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎస్‌సి, ఎస్‌టి డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కి వారిని నిలువున మోసం చేస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News