Wednesday, September 3, 2025

ఎన్నికల ముందు హామీల జాతర..ఎన్నికల తరువాత చెప్పుల జాతర:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ఎన్నికల ముందు హామీల జాతర.. ఎన్నికల తరువాత చెప్పుల జాతర అన్నట్లుగా నేటి రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం, ఎర్రవల్లి గ్రామ సమీపంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ క్షేత్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, సింగరేణి కార్మికులు దాదాపు 300 మంది రేగా కాంతారావు ఆధ్వర్యంలో పార్టీలో బిఆర్‌ఎస్‌లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. నేడు రాష్ట్రంలో జరుగుతున్న యూరియా, కరెంటు కోతలతో ఆనాటి కాంగ్రెస్ పాలన రోజులు మళ్లీ గుర్తు చేసిందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో డైలాగులు తప్ప ఏమీ జరగడం లేదని ఆరోపించారు. ఎన్నికల ముందు వేలం పాటగా 420 హామీలు ఇచ్చి, ప్రభుత్వాన్ని నడపడం చేతకాక మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను బదనాం చేస్తున్నారని మండిపడ్డారు.

దేశ చరిత్రలోనే కెసిఆర్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఏ రాష్ట్రంలో జరగలేదని, రాష్ట్రం రాక ముందుకు ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదుల నీటి కోసం ఎన్ని గొడవలు జరిగాయో మరో మారు రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోవాలని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ మన తెలంగాణలో ఉందని మేధావులు మాట్లాడుతుంటే నేటి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టును ఎలా వాడుకోవాలో కూడా చేతకావడం లేదంటూ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 80 మీటర్లలో ఉన్న నీటిని 618 మీటర్ల ఎత్తుకు ఉన్న కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్‌కు తీసుకువచ్చి హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సదుపాయం కల్పించిన ఘనత కెసిఆర్‌ది అని అన్నారు. నాడు తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ సాగులో 14వ స్థానంలో ఉంటే 2022 వ సంవత్సరం నాటికి దేశంలోనే వ్యవసాయ సాగులో రాష్ట్రాన్ని మొదటి స్థానానికి తీసుకువచ్చిన ఘనత కెసిఆర్ అని అన్నారు.

ఇన్ని అభివృద్ధి పనులు చేసిన కెసిఆర్‌పై సిబిఐ ఎంక్వైరీ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సిబిఐ మోడీ జేబు సంస్థ అని కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం సిబిఐ మంచి సంస్థ అని అనడం పట్ల అర్థమేంటో చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ జగదీశ్వర్ రెడ్డి, రేగా కాంతారావు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News