హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ కవితను పార్టీ బిఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆమె తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రధాన సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై కవిత సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (KTR) ఇప్పటివరకూ మాట్లాడలేదు. అయితే, తొలిసారిగా ఈ విషయంపై ఆయన స్పందించారు. తెలంగాణ భవన్‌లో కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. పార్టీలో చర్చించిన తర్వాతే పార్టీ అధినేత కెసిఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారని కెటిఆర్ స్పష్టం చేశారు.
పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కవిత ప్రెస్‌మీట్ పెట్టి హరీశ్‌రావు, సంతోష్‌లను టార్గెట్ చేస్తూ.. ఆరోపణలు చేశారు. హరీశ్, సంతోష్‌లు పక్కన ఉంటారు కానీ తెలంగాణ గురించి, కెటిఆర్ (KTR) గురించి ఆలోచించే వ్యక్తులు కాదని కెటిఆర్‌కు సూచించారు. వాళ్లను పక్కనపెడితే పార్టీ బతుకుతుందని, తన తండ్రి పేరు నిలబడుతుందని ఆమె అన్నారు. అయితే తాజాగా తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో కెటిఆర్‌ను కవిత గురించి ప్రశ్నించారు. దీనికి ఆయన కవిత చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చించిన తర్వాత అధినేత నిర్ణయం తీసుకున్నారని.. ఇంకా ఆ విషయంలో స్పందించడానికి ఏమీ లేదని చెప్పారు. దీంతో పాటు ఉప రాష్ట్రపతి ఎన్నికలకు కూడా తమ పార్టీ దూరంగా ఉంటుందని కెటిఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు.
Also Read : కాళేశ్వరం నీటిని వాడుకుంటూ ప్రాజెక్టును బద్నాం చేస్తున్నారు: కెటిఆర్