Sunday, May 18, 2025

‘కారు’ కోసం ఆ ముగ్గురి పోరు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బహుశా 2016లో భారత రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవిత ఒక తెలుగు న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ రాజకీయ వారసుడు ఎవరని అడిగితే ఇంకెవరు రామన్నే అని చెప్పారు. దాదాపు పదేళ్లు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారు అయినట్టు కనిపిస్తున్నది. తన కుమారుడి డిగ్రీ పట్టా ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు కవిత అమెరికా విమానం ఎక్కుతున్న సమయంలో తెలంగాణ రాజధానిలో పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది..

కవిత కొత్త పార్టీ పెడతారా, తండ్రిని ధిక్కరించి టిఆర్‌ఎస్ నుంచి బయటకు వస్తారా అని. పదేళ్ల కాలంలో ఎందుకు ఇంత మార్పు వచ్చింది? గత మాసంలో భారత రాష్ట్ర సమితి రజతోత్సవం సందర్భంగా ఆ పార్టీ కార్యాధ్యక్షుడు కేటీఆర్ పలు టీవీ చానళ్ళకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ‘తెలంగాణ రాష్ట్రం సాధిస్తే చాలు ఇంకేమీ అవసరం లేదు అనుకున్నాను, మంత్రి పదవి కూడా ఆశించలేదు, నేను అమితంగా వ్యతిరేకించే కాంగ్రెస్ లో గనుక ఆనాడు మా నాయన టిఆర్‌ఎస్ ను విలీనం చేసి ఉంటే రాజకీయాల్లో కూడా ఉండేవాడిని కాను. ఆ మాట సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పడంకోసం ఆమె నివాసంలోకి వెళుతుండగానే హరీశ్ రావుకు, నా భార్యకు స్పష్టంగా చెప్పాను’ అన్న కేటీ రామారావు ఇప్పుడు ఎందుకు కేసీఆర్ ఏకైక వారసుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చర్చ జరుగుతున్నది.

అధికారంలో ఉన్నప్పుడే భారత రాష్ట్ర సమితిలో కెసిఆర్ వారసత్వంకోసం మూడు స్తంభాలాట మొదలయింది. కేటీ రామారావు, హరీశ్ రావు, కవిత మధ్య పొరపొచ్చాలకు సం బంధించిన వార్తలు మీడియాకు మృష్టాన్న భోజనం అయిన విషయం తెలిసిందే. అయితే దాదాపు అన్ని సందర్భాల్లో ముగ్గురూ ‘కేసీఆరే మా నాయకుడు, మేమంతా ఆయన విధేయులం’ అని చెబుతూ వచ్చినా తాజా పరిస్థితి మాత్రం ఆ ముగ్గురి అంతరంగాలను ఆవిష్కరిస్తున్నట్టే కనిపిస్తున్నది.
నిన్న మొన్నటిదాకా ‘కేసీఆర్ నాయకుడు.. ఆయన నేతృత్వంలోనే నేను ఒక సైనికుడిగా పని చేస్తాను’ అని చెబుతూ వచ్చిన మాజీ మంత్రి, పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న సీనియర్ నాయకుడు హరీశ్ రావు హఠాత్తుగా కేటీ రామారావుకు నాయకత్వం అప్పగించినాసరే, కెసిఆర్ ఆదేశాలమేరకు ఆయన కింద కూడా పనిచేయడానికి తాను సిద్ధమని చెప్పడం పెద్ద చర్చకు దారి తీసింది.

పార్టీకి విధేయుడు, మరీ ముఖ్యంగా నాయకుడిపట్ల అపారమైన భక్తిప్రపత్తులు కలిగిన హరీశ్ రావు ఎందుకు స్వరం మార్చినట్టు? దీని వెనుక మతలబు ఏమిటి? అని చర్చ జోరందుకున్న సమయంలో కేటీ రామారావు స్వయంగా హరీశ్ రావు ఇంటికి వెళ్లి దాదాపు మూడు గంటలపాటు సమాలోచనలు జరపడం మరింత చర్చనీయాంశం అయింది. వారి మధ్య జరిగిన సంభాషణ ఏమిటన్నది ఊహకు అందని విషయం ఏమీ కాదు.

కేసీఆర్ వారసుడిగా ఆయన కుమారుడే ఉంటాడు అనడానికి, అధినాయకుడు కూడా అదే కోరుకుంటాడు అనడానికి నిదర్శనంగా ఇప్పటికే కొన్ని సంఘటనలు జరిగాయి. 2018 ఎన్నికల తర్వాత కేసీఆర్ త్వరలో కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా ప్రకటించబోతున్నారనే వార్తను పార్టీలోని రెండవ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ప్రజల స్పందనకోసం ప్రచారంలోకి తెచ్చారు. దానికి సరైన స్పందన రాకపోగా కొంత వ్యతిరేకత ఉందని గ్రహించిన కేసీఆర్ మళ్ళీ తానే దాన్ని సరిదిద్దుకుంటూ ‘నేను ఉన్నంతకాలం నేనే ముఖ్యమంత్రిని, నేనే నాయకుడిని’ అని చెప్పుకున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక గత మాసంలో రజతోత్సవ వేడుకల సందర్భంగా కూడా కేటీ రామారావే పార్టీ తదుపరి నేత అనే సంకేతాలు వెళ్లేట్టుగా సంఘటనలు జరిగాయి. తొలుత హరీశ్ రావుకి ఉత్సవాల నేతృత్వ బాధ్యతలు అప్పగించిన కేసీఆర్ మధ్యలో మనసు మార్చుకుని ఆ బాధ్యతను పూర్తిగా కేటీ రామారావు అప్పగించినట్టుగా బయటకు కనిపించే విధంగా పరిణామాలు మారుతూ వచ్చాయి. రజతోత్సవ వేడుకల వేదిక మీద కూడా కెసిఆర్ తన కుమార్తె కవితకుగానీ, హరీశ్ రావుకుగానీ ప్రాధాన్యత లేకుండా చేయడం చర్చనీయాంశం అయింది.

అయినా కెసిఆర్ ఇంకా క్రియాశీలక రాజకీయాల్లో ఉండగానే ఎందుకని వారసత్వ చర్చ వస్తున్నది? ఇటీవల ఆయన కొడుకు, కూతురు ఇద్దరూ రాజకీయ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు వారి మద్దతుదారులు ‘సీఎం సీఎం’ అంటూ నినదించినా అగ్రనాయకుడు ఉండగా అలా కోరుకోవడం సరైనది కాదని నివారించినట్టుగా కనిపించదు. మొన్నటికి మొన్న ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామానుజపురం శివారులో నాంచారమ్మ కల్యాణానికి హాజరై ప్రత్యేక పూజలు జరిపిన కవిత అక్కడ నాంచారమ్మ అమ్మవారి వేషధారణలో వచ్చిన బాలికలతో సోది చెప్పించుకున్నారు. ‘భవిష్యత్తులో మీరే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతార’ని చిన్నారులు అనడంతో ఆ మాటలను కవిత చిరునవ్వుతో ఆలకించారు కానీ వారించే ప్రయత్నం ఏమి చేయలేదు. ఇటీవలి కాలంలో కవిత హాజరవుతున్న పలు సభల్లో ఆమెను ఉద్దేశించి గుంపులో నుండి ‘సీఎం సీఎం’ అనే నినాదాలు వినిపించినా ఆమె ఆక్షేపించలేదు. ఇదే పరిస్థితి కేటీ రామారావు సభల్లో కూడా కనిపిస్తుంది. పోరాడి రాష్ట్రం సాధించిన నాయకుడు ఇంకా ఆరోగ్యంగా ఉండగా, రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండగా ఈ నినాదాలు ఏమిటని గట్టిగా మందలించింది లేదు.

ఇక్కడ ఒక పోలిక తీసుకురావచ్చు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఎన్నో ఏళ్లకు తాను ఆయన వారసురాలిని అంటూ, ముఖ్యమంత్రిని అవుతానంటూ ఆయన కూతురు షర్మిల బయలుదేరారు. తన సోదరుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు రాజకీయంగా, ఆర్థికంగా కూడా ఇవ్వవలసినంత భాగస్వామ్యం ఇవ్వనందుకు ఆమె అలిగి బయటకు వచ్చి రాజకీయాలు చేసే ప్రయత్నం చేశారు. సొంత పార్టీ పెట్టి ఘోరంగా విఫలమై, కాంగ్రెస్ పార్టీ లో చేరి ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. అక్కడ ఇవన్నీ వైయస్సార్ మరణానంతరం జరిగా యి. ఇక్కడ కేసీఆర్ క్రియాశీలకంగా ఉన్న కాలంలోనే కవిత తిరుగుబాటు ధోరణి ప్రదర్శిస్తున్నారంటే సహజంగానే చర్చ జరుగుతుంది. రామన్నే కేసీఆర్ వారసుడు అన్న దగ్గరనుండి రాజకీయ వారసత్వంలో వాటా కోరుకునే వరకు లేదా వారసురాలిని కావాలని కోరుకునేవరకు కవితలో వచ్చిన మార్పు ల వెనక కారణాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ సమయం లో కేసీఆర్ సంతానమిద్దరూ హరీశ్ రావు తర్వాతనే రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి పేరిట పార్టీ కార్యక్రమాలకు ఆమె కొంత ఊపునిచ్చిన మాట వాస్తవం. అందుకు ప్రతిఫలంగా నిజామాబాద్ నుంచి లోకసభ సభ్యురాలుగాఎన్నికై రెండవ పర్యాయం స్వయంకృతాపరాధంవల్ల ఓడిపోయారు. అయినా నాయకుడు ఆమెను శాసనమండలికి పంపించిన విషయం తెలిసిందే.

అయితే ఇటీవలి కాలంలో ముఖ్యంగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా తీహార్ జైలుకు వెళ్లి వచ్చిన తరువాత కొన్ని మాసాలకు తిరిగి ప్రజల్లోకి వచ్చి వివిధ విషయాల మీద మాట్లాడుతున్న కవిత పార్టీలో తనకు అన్యాయం జరుగుతున్నదనే భావనలో ఉన్నారు. అది పలుమార్లు ఆమె నోటనే బయటపడింది కూడా. నిజానికి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తాను ఆరు మాసాలు జైలుకు వెళ్లి వచ్చినా పార్టీ అగ్రనాయకత్వంనుండి సరైన స్పందన లేదని అభిప్రాయంతో ఉన్నారు. ఆ మేరకు ఆమె పార్టీ పరిణామాలపట్ల, తనపట్ల పార్టీ వ్యవహరిస్తున్న తీరు విషయంలో కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ తండ్రికి లేఖ రాసినట్టుగా చర్చ జరుగుతున్నది. లేఖలో ఏమున్నది అనే విషయం మనకు తెలియకపోయినా కొన్ని సందర్భాలలో ఆమె తన అభిప్రాయాన్ని బహిరంగంగా ప్రకటించడం పార్టీ నాయకత్వానికి.. ముఖ్యంగా పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కు, ఆయన వారసుడిగా ప్రచారంలో ఉన్న కేటీ రామారావుకు కొరుకుడు పడని విషయాలన్నది స్పష్టం. ‘భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ కోసం ఇంకా పోరాడాల్సి ఉంది’ అని కవిత బహిరంగంగా మాట్లాడడం అంటే తన తండ్రి పాలనలో వివిధ వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం జరగలేదని భావిస్తున్నట్టే కదా. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన కార్యక్రమాన్ని పార్టీ బహిష్కరించినా, కేసీఆర్ సహా నాయకులెవరూ అందులో పాల్గొనకపోయినా కవిత అందులో పాల్గొనడం నాయకత్వానికి కంటగింపుగానే కనిపించింది. అమెరికా వెళ్లే ముందు కవిత తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కూడా తనపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, వాళ్ళు ఎవరో తనకు తెలుసు అని చెప్పడం గమనార్హం. ఇది తన సోదరుడిని లేదా హరీశ్ రావును ఉద్దేశించి మాట్లాడిన విషయాలని అర్థం అవుతూనే ఉంది.

వయసురీత్యా, ఆరోగ్యరీత్యా లేదా జాతీయ రాజకీయ అవసరాల దృష్ట్యా కెసిఆర్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్లయితే రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారో అనే విషయంలో తగాదా జరగడం సహజం. ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా వారసత్వ తగాదాలు ఒక నాయకుడి నిష్క్రమణ అనంతరం జరుగుతాయి. చాలా కొద్ది సందర్భాలలోనే బహుళ ప్రజాదరణ కలిగిన నాయకుడు బ్రతికి ఉండగానే తిరుగుబాటు చేసి పదవీచ్యుతుడిని చేయడం చూసాం. అటువంటి సందర్భాలు భారతదేశ రాజకీయాల్లో తక్కువ. ఎన్టీ రామారావుకు జరిగిన వెన్నుపోటు అందుకు ఉదాహరణ. ఎంజీ రామచంద్రన్ చనిపోయాకే జయలలిత ఆయన రాజకీయ వారసత్వంకోసం పోటీపడి గెలిచారు. జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం మరో ప్రధానమంత్రి కొద్దిరోజులు బాధ్యతలు నిర్వహించిన తర్వాతే శ్రీమతి ఇందిరాగాంధీకి తండ్రి రాజకీయ వారసత్వం దక్కింది. మన ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో స్వతంత్రంగా ఎదిగి వచ్చినా రాజశేఖర్ రెడ్డి కుమారుడు అనే అపారమైన ప్రజాభిమానాన్ని చూరగొంటూ ఉన్నారు.

రాష్ట్రాన్ని సాధించుకుని ప్రజల మెప్పు పొంది అధికారంలోకి వచ్చి, పది సంవత్సరాల తర్వాత ప్రజలు తిరస్కరిస్తే ప్రతిపక్షంలో కూర్చున్న పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే ఇప్పుడు చేయాల్సింది వారసత్వం కోసం తగాదాపడటం కాదు. నెపం ప్రజల మీద నెట్టకుండా ఓటమికి కారణాలు విశ్లేషించుకుని జరిగిన తప్పులను సరిచేసుకొని ఆ తప్పులు మళ్ళీ జరగవని చెప్పి ప్రజలను మెప్పించి ఓట్లు అడిగితే ఫలితం ఉండొచ్చు. రాజకీయ వ్యూహరచనలో, ఎత్తుగడలలో తలపండిన కేసిఆర్ ఈ ముగ్గురినీ సముదాయించో, కఠినంగా వ్యవహరించో దారికి తెచ్చుకొని ఐక్యంగా అధికార కాంగ్రెస్ మీద పోరాటం చేస్తారా లేక కాగల కార్యం గంధర్వులే తీరుస్తారులే అని చోద్యం చూస్తారా?

amar devulapalli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News