Monday, September 8, 2025

పారిశుద్ధ్య కార్మికుడు మృతి.. రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కెటిఆర్ డిమాండ్

- Advertisement -
- Advertisement -

పారిశుద్ధ్య కార్మికుడి మృతిపై కెటిఆర్ ఆరా
కార్మికుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా

మనతెలంగాణ/హైదరాబాద్: ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తూ పెండింగ్ వేతనం రాకపోవడంతో కార్మికుడు మైదం మహేశ్ పురుగుల మందు తాగి ఇటీవల మృతిపై బిఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరా తీశారు. ఈ మేరకు రెడ్‌కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్‌రెడ్డి కెటిఆర్ ఆదేశాల మేరకు ఆదివారం మాధవరావుపల్లిలోని మృతుని ఇంటికి చేరుకొని పరామర్శించారు. అంతకు ముందు కెటిఆర్ పారిశుధ్య కార్మికుడి మరణం పైన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు నెలలుగా జీతాలు అందక ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుడు మహేష్ ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం అని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని పేర్కొన్నారు. కార్మికులకు కనీసం నెలనెలా జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిని తెచ్చినందుకు ముఖ్యమంత్రి, మంత్రి సీతక్క క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ములుగు నియోజకవర్గంలో జరిగిన ఈ దారుణ ఘటనకు మంత్రి సీతక్కతోపాటు.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే పూర్తి బాధ్యుత వహించాలని అన్నారు. బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిపోయి, మంచినీళ్లు అనుకుని పురుగుల మందు తాగి మరణించారని ఓ వీడియాను సృష్టించి ప్రచారం చేసుకోవడం మరో దుర్మార్గం అని మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో ప్రభుత్వ ఘోర వైఫల్యాన్ని, చేతకానితనాన్ని ప్రజాక్షేత్రంలో కప్పిపుచ్చలేరని అధికారపక్షానికి చెందిన నేతలు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, నెలల తరబడి పెండింగ్ పెడితే పేద కార్మికులు ఎలా బతకాలో ముఖ్యమంత్రి, మంత్రి సమాధానం చెప్పాలని అడిగారు. మృతుని కుటుంబానికి వెంటనే 50 లక్షల రుపాయల ఎక్స్ గ్రేషియాతోపాటు.. అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. లేకపోతే బిఆర్‌ఎస్ పక్షాన బాధితుని కుటుంబంతోపాటు, కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

ఫోన్‌లో మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కెటిఆర్
మృతుని కుటుంబం వద్దకు వెళ్లి పరామర్శించిన పార్టీ నేతలు, మహేష్ తల్లితో కెటిఆర్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మైదం మహేశ్ చనిపోవడానికి గల కారణాలను మృతుని తల్లిని అడిగి తెలుసుకున్నారు. గత 6 నెలలుగా వేతనం రాకపోవడంతో మనస్థాపంలో మృతి చెందాడని ఆమె కెటిఆర్‌కు తెలిపారు. జీతం కోసం తిరిగి తిరిగి బాధకు గురైన తన కొడుకు మున్సిపాలిటీ వాళ్ళు స్మశాన వాటిక కోసం ఇచ్చిన గడ్డి మందును తాగి చనిపోయారని చెప్పారు. మహేష్ తల్లి మాటలు విన్న కెటిఆర్ మనసు చెలించిపోయి దిగ్భాంతి వ్యక్తం చేశారు. కుటుంబానికి బిఆర్‌ఎస్ పార్టీ తరుపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

కెసిఆర్ తరుపున ముగ్గురు ఆడబిడ్డలను ఆదుకుంటామని, పార్టీ తరుపున పిల్లల పేర్లపై ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. రెండు రోజులో సతీశ్‌రెడ్డితో సాయం అందిస్తానని, అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. గతంలో ఇలాంటి ఇబ్బందులు ఉండేవా..? అని కెటిఆర్ అడిగిన క్రమంలో మహేశ్ తల్లి గతంలో ఇలా జీతం ఇబ్బందులు లేవని, ఆరు నెలల నుండి తన కొడుకు చేసిన కష్టం పైసల కోసం గోస పడ్డాడని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం కెటిఆర్ ఆదేశాల మేరకు పార్టీ తరుపున సాయం అందిస్తామని, మహేశ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వంతో కొట్లాడుతామని సతీష్ రెడ్డి తెలిపారు. ఆయన వెంట బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేశ్‌రెడ్డి, నాయకులు పోరిక పోమానాయక్, వేముపల్లి భిక్షపతి, పోరిక విజయ్‌రామ్‌నాయక్, గజ్జి నగేశ్, కోగిల మహేశ్, ఆకుతోట చంద్రమౌళి, గరిగె రఘు తదితరులు ఉన్నారు.

Also Read: కాంగ్రెస్ పాలనలో దీనస్థితికి గురుకులాలు: హరీష్ రావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News