కల్వకుంట్ల కుటుంబంలో తారాస్థాయికి విభేదాలు
ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్
మన తెలంగాణ/హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని, బిఆర్‌ఎస్‌లో ముసలం మొదలైందని ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ ఆరోపించారు. శుక్రవారం సీఎల్పీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ప్లీనరీలో హరీష్‌రావుకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ఎప్పడూ లేని విధంగా హరీష్ రావు ఇంటికి కెటిఆర్ వెళ్లి రెండు గంటలు చర్చలు జరపడం పలు అనుమానాలకు తావు ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. హరీష్ రావు ఇంట్లో జరిగిన వేడుకలకు గతంలో కెటిఆర్ కుటుంబం దూరంగా ఉందన్నారు.
ఇప్పుడు అకస్మాత్తుగా హరీష్ రావుపై కెటిఆర్‌కు ఎందుకు ప్రేమ వచ్చిందని ఆయన ప్రశ్నించారు. హరీష్ రావు కొత్త పార్టీ ఏర్పాటు చేస్తొన్నట్లు విస్తృత ప్రచారం జరుగుతుం దని ఆయన ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబసభ్యుల మధ్య ఆధిపత్యపోరు జరుగుతోందని, రాజకీయ ఆధిపత్యం కోసం కొట్లాడుకుంటున్నారని ఆయన వెల్లడించారు. హరీష్‌రావుతో చర్చల మతలబు ఏమిటో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.