మన తెలంగాణ/భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: బిజెపిలో తమ పార్టీ విలీ నం ప్రసక్తే లేదని ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు స్పష్టం చేశారు. భూపాలపల్లి జిల్లా, మొగుళ్లపల్లి, భూపాలపల్లి, హన్మకొండ జిల్లా పరకాలలో నిర్వహించిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల్లో గులాబీ జెండా ఎగురవేయాలని హితవు పలికారు. తమ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, వాటిని గ్రామాల్లో ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. తమ పాలనలో రాష్ట్రంలో నూతన జిల్లాలను, తండా పంచాయతీలను ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ, ఆసుపత్రులు కట్టించి కెసిఆర్ నాయకత్వాన తెలంగాణను అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. కాంగ్రెస్, బిజెపి సింగరేణిని ప్రైవైటుపరం చేయాలని చూస్తున్నాయని అన్నారు.
కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల కష్టాలు తీరుతాయని అన్నారు. కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం యుద్ధమే చేయాల్సి వస్తోందని అన్నారు. ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్‌లో బిసిలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం నాట్ల టైంలో రైతుబంధు ఇస్తే కాంగ్రెస్ ఓట్ల టైంలో ఇస్తోందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాలను పట్టించుకోక 20 నెలల్లో రెండు నుండి మూడు వేల మంది విద్యార్థులు అవస్థలకుగురై 100 మంది వరకు చనిపోయారని అన్నారు. బిఆర్‌ఎస్ నాయకులంతా బాధ్యతగా తీసుకొని జిల్లాలోని గురుకులాలను సందర్శించి విద్యార్థులను కాపాడాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు అవస్థలకు గురైతుంటే ప్రభుత్వం దున్నపోతు నిద్రపోయినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అందాల పోటీలకు వచ్చిన వారికి ప్లేటుకు లక్షరూపాలయల చొప్పున బోజనాలు పెట్టారని, కానీ విద్యార్థులను పట్టించుకోవడంలేదని అన్నారు. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టని అన్నారు.
80 అడుగుల నీటిమట్టం నుండి 618 అడుగుల ఎత్తుకు నీటిని తీసుకెళర్లే ఒక బృహత్తర ప్రాజెక్టు అని, దానిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నీళ్లను చంద్రబాబు పాలు, నిధులను రాహుల్‌గాంధీపాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి బండ ప్రకాష్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంఎల్‌ఎలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, మిర్యాల రాజిరెడ్డి, గండ్ర జ్యోతి తదితరులు పాల్గొన్నారు.