శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బిసి) సొరంగం కూలిన ఘటన జరిగి 200 రోజులు దాటినా ఆరుగురు కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ సర్కారు నేరపూరిత నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కెటిఆర్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగురు బాధితుల మృతదేహాలను కూడా వెలికితీయలేకపోయింది, కుటుంబాలకు ఎటువంటి పరిహారం కూడా చెల్లించలేదని అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నపాటి సమస్యలకే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని పంపించి హంగామా సృష్టించిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ఎస్‌ఎల్‌బిసి ఘటనపై దర్యాప్తు చేయడానికి ఎందుకు ఒక్క బృందాన్ని కూడా పంపలేదని ప్రశ్నించారు.
ఒక్క ప్రశ్న కూడా ఎందుకు లేవనెత్తలేదని అడిగారు. బిజెపి బడే భాయ్ ఎందుకు తెలంగాణలో కాంగ్రెస్ చోటే భాయ్‌ని ఎప్పుడూ కాపాడుతున్నారు.. ఇది ఎలాంటి అపవిత్ర బంధం.. అని ఆయన నిలదీశారు. ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయి 200 రోజులు దాటినా ప్రభుత్వానికి పట్టడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన రోజున, ఆ ఆరు కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని కెటిఆర్ తెలిపారు.ఆ ఆరుగురి ప్రాణాలను బలిగొన్న వారికి శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ విధ్వంసం చేసిన ప్రతి దానితో పాటు ఎస్‌ఎల్‌బిసి సొరంగం కూలిపోవడానికి గల కారణాలకు తాము సమాధానాలు రాబడతాం, ఇది బిఆర్‌ఎస్ వాగ్దానం అని కెటిఆర్ హామీ ఇచ్చారు.
Also Read: తెలంగాణను ప్రముఖ వెడ్డింగ్ గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ధ్యేయం