Wednesday, July 9, 2025

నేను వస్తే.. సిఎం పారిపోయారు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

రేవంత్‌ రెడ్డికి రచ్చ చేయడమే తెలుసు…చర్చ చేయడం రాదు
సవాల్ విసరడం..మాట తప్పడం ఆయనకు అలవాటే 
సత్తా లేనప్పుడు సవాల్ విసరడం ఎందుకు? 
మహా నాయకుడు కెసిఆర్‌పై అడ్డగోలుగా మాట్లాడినందుకు ముక్కు నేలకు రాసి.. క్షమాపణ చెప్పాలి
సిఎం రాకుంటే మంత్రులు వచ్చినా చర్చకు సిద్ధం: కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రచ్చ చేయటమే తెలుసు తప్ప చర్చ చేయటం రాదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. బూతులు తప్ప రైతుల గురించి బేసిక్ నాలెడ్జ్ లేని రేవంత్ రెడ్డి అసమర్థత పాలనతో 18 నెలల నుంచి తెలంగాణలోని 70 లక్షల మంది అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కి రావాలని తాను సవాల్ చేస్తే రేవంత్‌రెడ్డి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రైతులపై చర్చకు సిఎం రేవంత్‌రెడ్డి కోసం తాను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వేచి చూశానని, కానీ తనతో చర్చకు రాకుండా.. రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పారిపోయారని ఎద్దేవా చేశారు. రైతులు, నిరుద్యోగులకు బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేశాయో సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చిద్దాం రమ్మని సిఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించిన కెటిఆర్, చెప్పిన సమయానికి అక్కడికి వెళ్లారు.

తాను చెప్పినట్లుగా (జూలై 8) మంగళవారం 11 గంటలకు వచ్చామని, కానీ రేవంత్‌రెడ్డి ఎక్కడ అంటూ నిలదీశారు. రేవంత్‌రెడ్డికి బేషజాలు తప్పా బేసిన్ల గురించి తెలియదని ప్రిపేర్ అయి రావడానికి మూడు రోజుల సమయం ఇచ్చామని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న 600 మంది అన్నదాతల కోసం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి కెటిఆర్ ఒక నిమిషం మౌనం పాటించారు. రేవంత్ రెడ్డి కోసం అరగంట వేచి చూసి తరువాత మీడియాతో మాట్లాడారు. తన పేరు తీసి స్వయంగా ముఖ్యమంత్రే చర్చకు రావాలని సవాల్ విసిరితే తాను స్వీకరించానని అన్నారు. ఆయనకు సమాధానం చెప్పేందుకు సమగ్ర సమాచారంతో వచ్చానని పేర్కొన్నారు. రైతు భరోసాలోని డొల్లతనాన్ని బట్టబయలు చేయడానికి అధికారిక సమాచారంతో వచ్చానని చెప్పారు.

బురదజల్లడం.. పారిపోవడం రేవంత్‌రెడ్డికి అలవాటే
బురదజల్లడం.. పారిపోవడం రేవంత్‌రెడ్డికి మొదటి నుంచి అలవాటే అని, చర్చకు సిఎం రాకుంటే ఏ మంత్రినైనా పంపించినా తాను చర్చకు సిద్ధం కెటిఆర్ సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డి గతంలో ఎన్నోసార్లు సవాల్ విసిరి తప్పించుకుపోయారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కొడంగల్‌లో తాను ఒడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేసి ఆరు నెలలు తిరగకముందే మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేశారని,జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి మాట మీద నిలబడే వ్యక్తి కాదు కాబట్టే ఆయన కొరిక మేరకు కొడంగల్లోనైనా, కొండారెడ్డిపల్లిలోనైనా,ఆయన జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో అయినా.. అసెంబ్లీలోనైనా చర్చకు సిద్ధమని చెప్పారని అన్నారు. అలా కాదు అంటే తటస్థ వేదిక అయిన ప్రెస్‌క్లబ్‌కు తామే వస్తామని చెప్పామని తెలిపారు. ఒకవేళ ముఖ్యమంత్రి చర్చకు రాలేకపోతే ఆయన తరపున బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి గానీ, వ్యవసాయ మంత్రి గానీ, లేదంటే ఇంకెవరైనా మంత్రులు వస్తారనుకుంటే వాళ్లు కూడా రాలేదన్నారు. తొడలు కొట్టడం, రంకెలు వేయడం, సవాళ్లు విసిరి పారిపోవడం రేవంత్‌కు అలవాటే అని విమర్శించారు.

సిఎం నియోజకవర్గంలోనే రైతు భరోసా రాలేదు
ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోనే 670 మంది రైతులకు రైతుభరోసా రాలేదని కెటిఆర్ అన్నారు. వారి పేర్లు, అడ్రస్సులు, ఫోన్ నెంబర్లను తీసుకొచ్చానని చెప్పారు. అంతేకాదు రుణమాఫీ కానీ లక్షల మంది అధికారిక జాబితా తమ దగ్గర ఉందని చెప్పారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయం చేయలేక ఆత్మహత్యలు చేసుకున్న 670 మంది రైతుల వివరాలు, వడ్ల బోనస్ రాక పంటలు అమ్ముకునే దిక్కు లేక ప్రభుత్వం కొనుగోలు చేయక మిల్లర్లకు అమ్ముకొని నష్టపోయిన రైతుల జాబితా కూడా తమ దగ్గర ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి లేదా ఎవరైనా మంత్రులు చర్చకు వస్తే ఆ వివరాలు ఇచ్చేవాడినని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు ఇస్తామని అన్నారని… బాండ్ పేపర్లు కూడా రాసి ఇచ్చారని.. వాటిని ఎందుకు పూర్తిగా ఇవ్వడం లేదని నిలదీశారు.

ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి
సిఎం రేవంత్‌రెడ్డి స్థాయి కెసిఆర్ అవసరం లేదని, తాము సరిపోతామని కెటిఆర్ తెలిపారు. సోషల్ మీడియాలో పిల్లలు పోస్టులు పెడితేనే గజగజ వణికిపోతున్న రేవంత్ స్థాయికి కెసిఆర్ అవసరం లేదని అన్నారు. రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పే సత్తా బిఆర్‌ఎస్‌లోని ప్రతీ ఒక్క నాయకుడికి ఉందని పునరుద్ఘాంటిచారు. బిఆర్‌ఎస్ నాయకులకు మైకు ఇవ్వకుండా అసెంబ్లీలో టైం పాస్ చేస్తున్న కాంగ్రెస్ వైఖరిని ప్రజలు ఈసడించుకుంటున్నారన్నారు. రేవంత్‌రెడ్డికి నిజాయితీ, నిబద్ధత ఉంటే చర్చకు రావాలని, లేదంటే మహానాయకుడు కెసిఆర్‌పై అడ్డగోలుగా మాట్లాడినందుకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుబంధు, రైతు భీమాతో పాటు భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి 24 గంటలు ఉచితంగా అన్నదాతలకు కరెంటు ఇచ్చిన కెసిఆర్‌పై మరోసారి తప్పుడు కూతలు కూయనని, పనికిమాలిన సవాళ్లు చేయనని రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలన్నారు. చర్చకు వచ్చే సత్తా లేనప్పుడు.. రేవంత్‌రెడ్డి మరోసారి సవాల్ చేయొద్దని కెటిఆర్ హితవు పలికారు. చర్చ కోసం తాను ఎక్కడికి రమ్మన్న వస్తానని చెప్పారు.ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉంటారన్న సంగతి తమకు కూడా తెలుసు అని, ఆయనకు మరొక అవకాశం ఇస్తామని అన్నారు. ప్లేస్, డేట్,టైం, ఆయనే డిసైడ్ చేస్తే ఎక్కడికైనా వచ్చి ఏ అంశం మీదనైనా చర్చించడానికి కెసిఆర్ తయారుచేసిన గులాబీ దండు సైనికులం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

ఎమర్జెన్సీని తలపించేలా ఇందిరమ్మ రాజ్యం
18 నెలల నుంచి తెలంగాణలో సాగుతున్న కాంగ్రెస్ అరాచక పాలనతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని కెటిఆర్ మండిపడ్డారు. ఎరువుల కొరతతో రైతులు సతమతం అవుతున్నారని, ఒక ఆధార్ కార్డు మీద ఇచ్చే ఒక ఎరువుల బస్తా, యూరియా బస్తా కోసం చెప్పులు క్యూలో పెట్టి ఫర్టిలైజర్ దుకాణాల ముందు రైతులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. మళ్లీ ఆనాటి రోజులు తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్ నిజంగానే ఆ పాత దుర్ధినాలను తీసుకొచ్చిందని అన్నారు. కరెంటు కోతలు, ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయే ఆనాటి రోజులు మళ్లీ ఇప్పుడు వచ్చాయన్నారు. ఎరువులు, విత్తనాల కోసం లైన్లో నిలబడే ఆనాటి రోజులను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తీసుకొచ్చిందని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ కేసులు, అణచివేతలు, నిర్భందాలు అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా ఇందిరమ్మ రాజ్యం ఉందని పేర్కొన్నారు.సోషల్ మీడియాలో పోస్టు రీట్వీట్ చేస్తే శశిధర్‌గౌడ్‌ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటో ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. దళితులు, గిరిజనులు, పేదల పొట్ట కొడుతున్న ఈ ఇందిరమ్మ రాజ్యానికి ఘోరి కట్టడంతో పాటు రేవంత్‌కు కర్రు కల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో నోటికొచ్చిన హామీలు, వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక కోట్లాది కుటుంబాలను కాంగ్రెస్ దగా చేసిందని విమర్శించారు.

రేవంత్‌రెడ్డి వచ్చాక నీళ్లు ఆంధ్రాకు, నిదులు ఢిల్లీకి
రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబు కోసం తెలంగాణ నీళ్లను ఆంధ్రకు పంపుతున్నారని కెటిఆర్ ఆరోపించారు. తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ, తెలంగాణ రైతులను మోసం చేస్తూ గురువు చంద్రబాబుకు కృష్ణా, గోదావరి నీళ్లను రేవంత్ ఏపీకి తరలిస్తున్నారని విమర్శించారు. గోదావరి నీళ్లను అక్రమంగా ఏపీకి తరలించేందుకు కడుతున్న బనకచర్లకు రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా నీళ్లను దొంగ చాటుగా తీసుకెళ్తుంటే కళ్ళు మూసుకొని చంద్రబాబు కోవర్టుగా రేవంత్ వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. ఏ ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉంది అని చిన్న పిల్లాడిలా ఇరిగేషన్ అధికారులను రేవంత్ అడుగుతుంటే ఇతనా మనకు న్యాయం చేసేదని రాష్ట్రంలోని రైతులు బాధపడుతున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్, కెసిఆర్‌తో తాము ఉద్యమాన్ని నడిపామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే నినాదంతో పనిచేస్తున్నారని, కానీ ఆంధ్రకు నీళ్లను, నిధులను ఢిల్లీకి పంపుతూ తన తొత్తులకు నియామకాలు ఇచ్చుకొని రేవంత్ మురిసిపోతున్నాడని చెప్పారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లింది యూరియా బస్తాల కోసం కాదని ఆరోపించారు. ఏ బస్తాలు మోసి రేవంత్ ముఖ్యమంత్రి పదవి కాపాడుకుంటున్నారో అందరికీ తెలుసు అని విమర్శించారు.

హామీల అమలుపై 18 నెలలుగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం
కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై ఈ ప్రభుత్వాన్ని 18 నెలలుగా నిలదీస్తున్నామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు బయలుదేరే ముందు బిఆర్‌ఎస్ నేతలతో కలిసి తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధిపై చర్చకు రావాలని సిఎం రేవంత్‌రెడ్డిని ఎన్నో సార్లు ఆహ్వానించామని తెలిపారు. అసెంబ్లీలో కాదంటే.. ప్రెస్‌క్లబ్‌లోనైనా చర్చకు రావాలని చెప్పానని పేర్కొన్నారు. రుణమాఫీ, రైతు బోనస్ వంటి అంశాలపై చర్చకు రావాలని ఆహ్వానించినట్లు చెప్పారు. సిఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఉన్నారని తెలిసిందని, సిఎం రాకుంటే మంత్రులైనా రావాలని కోరారు. సిఎం ఈరోజు హాజరుకాకుంటే.. మరో రోజు చర్చకైనా తాము సిద్ధం అని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి వీలైన తేదీ, ప్రదేశం చెప్పాలని అడుగుతున్నామన్నారు. అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా మాట్లాడిస్తామని హామీ ఇస్తే.. అసెంబ్లీలో కూడా సిద్ధమని తెలిపారు. ఈ ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, రేవంత్‌రెడ్డి తప్పుకొంటే.. అభివృద్ధి అంటే ఏంటో కెసిఆర్ చేసి చూపిస్తారని అన్నారు. మీడియాతో మాట్లాడిన అనంతరం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు బయలుదేరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కెటిఆర్.. సిఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పరార్…చర్చకు కెటిఆర్…ఢిల్లీకి రేవంత్‌రెడ్డి అంటూ బిఆర్‌ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News