దేశ రాజకీయాాలు కేవలం రెండు పార్టీలకే పరిమితం అన్నట్లుగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి గల నిరంతర వైఫల్యాలకు ప్రధాన కారణం ఇదేనని ధ్వజమెత్తారు. ‘మాకు మద్దతివ్వకపోతే మీరు బీజేపీ పక్షాన ఉన్నట్లే’ అనే అహంకారపూరిత వైఖరి దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ను ఒంటరిని చేసిందని ఆయన ఘాటుగా విమర్శించారు. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల సందర్భంగా కొన్ని పార్టీల వైఖరిపై జైరాం రమేష్ చేసిన ట్వీట్‌కు కెటిఆర్ ఘాటుగా బదులిచ్చారు. దేశం ఒకప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు రెండు ముక్కల దేశం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి అహంకారమే కాంగ్రెస్ పార్టీని జాతీయ రాజకీయాల్లో విఫలం చేసిందని అన్నారు. ‘మాతో ఉంటేనే మిత్రులు, లేదంటే వాళ్ల వైపు ఉన్నట్లే’ అనే వాదన అసమర్థనీయం’ అని పేర్కొన్నారు.
బిఆర్‌ఎస్ పార్టీ ఎప్పటికీ కాంగ్రెస్‌కు బీ -టీమ్ కాదు అని, బిజెపికి కూడా బీ -టీమ్ కాదు అని తేల్చి చెప్పారు. తాము తెలంగాణ ప్రజల ఏ- టీమ్ అని గట్టిగా ఉద్ఘాటించారు. ప్రాంతీయ పార్టీలను రాజకీయ ఆటల్లోకి లాగే బదులు, తమ పార్టీ ఎదుర్కొంటున్న వైఫల్యాలపై దృష్టి పెట్టాలని కెటిఆర్ జైరాం రమేష్‌కు హితవు పలికారు. భారతదేశ రాజకీయాలు కేవలం కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్యనే నడుస్తున్నట్లుగా భావించడం వారి వైఫల్యాలకు మరో ఉదాహరణ అని అని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ ప్రాధాన్యతలు తెలంగాణ ప్రజలకు కోసమే అని, తెలంగాణ ప్రజల శ్రేయస్సు, ఆకాంక్షలు, వారి గొంతుకగా ఢిల్లీలో నిలబడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. దిల్లీలోని రాజకీయాల ఆటల్లో తాము భాగస్వాములం కాదని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు విమర్శలు చేయడం మానుకుని, తమ పార్టీ పాలనాపరమైన, ఎన్నికల వైఫల్యాలపై కాంగ్రెస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని కెటిఆర్ సూచించారు.