నగరంలో కల్తీ కల్లు బారిన పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని ఎక్స్ వేదికగా కోరారు. ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. కుటుంబం కోసం కాయాకష్టం చేసే కష్టజీవులు కల్తీ కల్లు బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. ఇంత మంది చనిపోతే ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికి బుల్డోజర్
ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికి బుల్డోజర్ అంటూ కెటిఆర్ విమర్శించారు. మహానగరం హైదరాబాద్ దాటి మారుమూల పల్లెల వరకు జనారణ్యం నుండి వనారణ్యం వరకు బుల్డోజర్ రాజ్యం అంటూ ఎక్స్ వేదికగా ఆరోపించారు. పేదలకు రూ.4000 పెన్షన్ రాదు..ఆడబిడ్డలకు రూ.2500 మహాలక్ష్మి పథకం రాదు..అన్నదాతలకు రుణమాఫీ రాదు..రైతన్నలకు రూ.15,000 రైతుభరోసా రాదు..మరణించిన రైతు కుటుంబాలకు రైతుబీమా రాదు..పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం రాదు..విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు రావు..పేదలకు ఇందిరమ్మ ఇండ్లు రావు అని విమర్శించారు. ఆరు గ్యారంటీలు గాలికి..అడగని గ్యారంటీలు ముందుకు..జాగో తెలంగాణ జాగో అంటూ ట్వీట్ చేశారు.