Friday, August 1, 2025

రాజ్యాంగాన్ని అవహేళన చేయవద్దు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పుపై బిఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన సిజెఐకి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తరఫున ఎన్నికైన 10 ఎంఎల్‌ఎలు ప్రలోభాలకు లొంగి పార్టీ మారినా..కష్టకాలంలో పార్టీ వెంట ని లిచిన లక్షలాది కార్యకర్తలకు కెటిఆర్ ధన్యవాదాలు చెప్పారు. 20 నెలల నుంచి రేవంత్ ప్రభుత్వం చేస్తున్న అడ్డగోలు, అప్రజాస్వామిక, అవినీతి రాజకీయాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ పార్టీకి అండగా ఉన్న లక్షలాదిమంది కార్యకర్తలు గొప్ప స్ఫూర్తిని చాటారని కొనియాడారు. సుప్రీంకోర్టు తీర్పుతో రానున్న మూడు నెలల్లో 10 నియోజకవర్గా ల్లో ఉప ఎన్నికలు వస్తాయని, ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పని చేద్దామని కార్యకర్తలకు కెటిఆర్ పిలుపునిచ్చారు. స్పీకర్ పదవిని అడ్డంపెట్టుకొని రాజ్యాంగాన్ని అవహేళన చేయవద్దని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పే పాంచ్ న్యాయ సూత్రకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు.పార్టీ ఫిరాయింపుల పైన రాష్ట్రానికో నీతి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నీతి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక నీతి అన్నట్టుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ అవకాశవాద వైఖరిని ప్రశ్నించి తనకు వెన్నుముక ఉందని నిరూపించుకునే అవకాశం రాహుల్‌కు వచ్చిందన్నారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రజాస్వామిక సూక్తులను వల్లెవేస్తూ తిరిగితే సరిపోదని, తెలంగాణలో కాంగ్రెస్ అనుసరించిన ఫిరాయింపులను తిరస్కరించాలని రాహుల్ గాంధీకి హితవు పలికారు. లేకుంటే రాహుల్ గాంధీ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. దేశ ప్రజాస్వామిక చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయేలా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కోసం బిఆర్‌ఎస్ తరపున సమర్థవంతమైన వాదనలు వినిపించిన న్యాయవాద బృందానికి ధన్యవాదాలు తెలిపారు. సత్యమేవ జయతే.. జై కెసిఆర్! జై తెలంగాణ! అని కెటిఆర్ నినదించారు.

మీరు బోధించే వాటిని ఆచరించగలరా..?: రాహుల్‌గాంధీకి హరీష్‌రావు సూటి ప్రశ్న
రాష్ట్రంలో పార్టీ మారిన ఎంఎల్‌ఎల అనర్హత వేటు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ ఎక్స్ వేదికగా స్పందించారు. మీరు బోధించే వాటిని మీరు ఆచరించగలరా..? అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ సూటిగా ప్రశ్నించారు. మీ తండ్రి దివంగత రాజీవ్ గాంధీ 52వ రాజ్యంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టిన ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. పార్టీ మారిన ఎంఎల్‌ఎలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్పీకర్‌ను మీరు కోరుతారా..? అని ప్రశ్నించారు. లేదా రాజ్యాంగాన్ని చేతిలో మోసుకెళ్లడం కేవలం ఎన్నికల మోసమా..? అని రాహుల్ గాంధీని హరీష్‌రావు నిలదీశారు.

సుప్రీంకోర్టు తీర్పును బిఆర్‌ఎస్ స్వాగతిస్తోంది: కె.పి.వివేకానంద
పార్టీ మారిన ఎంఎల్‌ఎల అనర్హత వేటు విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కె.పి. వివేకానంద చెప్పారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందన్నారు. ప్రజాస్వామ్యంపై ముఖ్యమంత్రికి గౌరవం ఉంటే వెంటనే 10 మంది ఎంఎల్‌ఎలతో రాజీనామా చేయించి.. ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. గతంలో న్యాయవ్యవస్థను శాసించే విధంగా సిఎం వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News