జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లి మండలం, మండెపల్లి గ్రామానికి చెందిన మంద మహేశ్ అనే యువకుడు కంపెనీ బస్సులో పనికి వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయాయినా మహేశ్ మాత్రం బతికినప్పటికీ తీవ్ర గాయాలతో ఇబ్బందుల్లో ఉన్నాడు. ప్రస్తుతం అక్కడి జుబెయిల్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డబ్బులు లేక సరైన వైద్యం అందక అతని పరిస్థితి విషమంగా మారుతోంది. ఈ విషయం తెలుసుకున్న సిరిసిల్ల ఎంఎల్‌ఎ కెటిఆర్ మండెపల్లి గ్రామంలోని మహేశ్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబానికి భరోసా ఇచ్చారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటానని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సౌదీలో చికిత్స పొందుతున్న మహేశ్‌తో వీడియో కాల్ ద్వారా ఆయన మాట్లాడారు.
‘అధైర్య పడొద్దు ..నాలుగు ఐదు రోజుల్లోనే సొంత ఖర్చులతో నిన్ను స్వస్థలానికి తీసుకువస్తాను..’అని భరోసా ఇచ్చారు. వెంటనే సౌదీలో ఉన్న పార్టీ ప్రతినిధులు తెలిసిన వారిని జుబెయిల్ ఆసుపత్రికి పంపించి మహేశ్‌కు అండగా ఉండేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. అంత తీవ్ర ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మహేశ్ ధైర్యంగా ఉండాలని, కుటుంబం కోసం బలంగా ఉండాలని ఆకాంక్షించారు. మహేశ్‌కు అవసరమైన వైద్య ఖర్చులు, విమాన ప్రయాణ ఖర్చులు తానే భరిస్తానని, ఆ కుటుంబానికి అన్నివిధాలుగా ఆదుకుంటామని తెలిపారు. స్వస్థలానికి వచ్చే ప్రక్రియలో అవసరమైన అధికారిక కార్యక్రమాల సమన్వయం కోసం తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ శాఖ, విదేశాంగ శాఖ అధికారులకు లేఖ రాశారు.