హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పందించారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుందని చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. “తన పాంచ్ న్యాయ్‌లో పార్టీ మారిన ఎమ్మెల్యేను అనర్హులుగా పరిగణిస్తామని చెప్పిన రాహుల్ గాంధీ.. సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నాను. రాహుల్ గాంధీ, ఆయన పార్టీ భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడానికి స్పీకర్ పదవిని ఉపయోగించరని నేను ఆశిస్తున్నా. ఈ మూడు నెలల సమయంలో రాష్ట్రంలోని 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికల కోసం మేము మా పని మొదలుపెడతాం” అని కెటిఆర్ పేర్కొన్నారు.
కాగా, పిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై గురువారం(జూలై 31న) సుప్రీం కోర్టు తీర్పు వెలువరిస్తూ.. మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఆదేశించింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ గవాయ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అనర్హతపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన తర్వాత.. ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారని చెప్పింది. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను.. పెండింగ్‌లో ఉంచడం సరికాదని పేర్కొంది. విచారణను పొడిగించడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే.. స్పీకర్ ప్రతికూల నిర్ణయం తీసుకోవచ్చని సూచించింది. పార్టీ ఫిరాయింపులపై పార్లమెంట్‌లో చట్టం చేయాలని ధర్మాసనం అభిప్రాయపడింది.