హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటీవల సిట్ విచారణకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై (KTR) తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెటిఆర్.. బండి సంజయ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే బండి సంజయ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయనకు కెటిఆర్ షాక్ ఇచ్చారు. బండి సంజయ్‌కి కెటిఆర్ లీగల్ నోటీసులు పంపించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంజయ్ అసత్యాలు మాట్లాడారని నోటీసులో (KTR) పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతయుతమైన పదవిలో ఉండి.. బాధ్యతరహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. రాజకీయ ఉనికి కోసమే అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. ఒక ప్రజాప్రతినిధిపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు. భవిష్యత్తులో అసత్య ఆరోపణలు చేయకుండా ఉండాలని.. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో క్రిమినల్ చర్యలకు బాధ్యులు అవుతారని హెచ్చరించారు.