ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా?
మేము అధికారంలో ఉన్నప్పుడు రేవంత్‌లా లేకి పనులు చేయలేదు
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం
రేవంత్ పాలనలో నీళ్లు ఆంధ్రాకు..నిధులు ఢిల్లీకి
హరీశ్‌రావు వ్యంగ్యాస్త్రాలు
కెటిఆర్, హరీశ్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన మెదక్ జిల్లాకు
చెందిన పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు, కార్యకర్తలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారని.. అవి అమలు చేయలేదని చెప్పారు. రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సమయం వచ్చిందని అన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బిఆర్‌ఎస్ అగ్రనేతలు కెటిఆర్, హరీష్‌రావు సమక్షంలో మెదక్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ ఇంచార్జి పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు, కార్యకర్తలు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి కెటిఆర్, హరీష్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశామని.. కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని తాను చూడలేదంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్‌టిఆర్, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి ,రోశయ్య, కెసిఆర్ లాంటి ముఖ్యమంత్రులను చూసిన ప్రజలు రేవంత్ రెడ్డిని చూసి ఛీ అనుకుంటున్నారని చెప్పారు. ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రుణ మాఫీ లేదు.. రైతు బంధు లేదంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. సిఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. తాము అధికారంలో ఉన్న పదేళ్లు రేవంత్ రెడ్డి లాగా లేకి పనులు చేయలేదని విమర్శించారు. తాము ప్రతిపక్షాల మీద అడ్డమైన కేసులు పెట్టలేదు, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను పోలీసులతో కొట్టించలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి పాలనలో ఆరాచకాలను ఈ సందర్భంగా కెటిఆర్ వివరించారు.
ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ సిఎం రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. సిఎం రేవంత్ రెడ్డిని గ్రామాల్లో తిడుతున్న తిట్లు ఇప్పటిదాకా చరిత్రలో ఏ ముఖ్యమంత్రిని తిట్టలేదని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని సిఎం రేవంత్ రెడ్డి అంటున్నారని.. అందుకే వందనా నీ బొందనా అని తాను స్పందించానని చెప్పారు. ఢిల్లీకి పోతే దొంగల్లాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకుపోయే దొంగల్లాగా చూస్తున్నారని ఎవరైనా ముఖ్యమంత్రి చెప్పుకుంటారా..? అని ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చిన కెసిఆర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం న్యాయమా..? అని అడిగారు. కెసిఆర్, బిఆర్‌ఎస్ లేకపోతే.. గులాబీ జెండా ఎగరకుంటే.. తెలంగాణ వస్తుండేనా..? అని ప్రశ్నించారు. తెలంగాణ సిఎంగా రేవంత్ రెడ్డి ఆ కుర్చీలో కూర్చున్నారంటేనే.. అందుకు కెసిఆరే కారణమని అన్నారు. హరీష్ రావు దగ్గర రేవంత్ రెడ్డి శిష్యరికం చేశారని, హరీష్ రావు మంత్రి అయినప్పుడు ఇదే తెలంగాణ భవన్ ముందు రేవంత్ డాన్సులు కూడా చేశారని గుర్తు చేశారు.
ఇచ్చిన హామీలను అమలు చేసినప్పుడు ముఖ్యమంత్రిని కచ్చితంగా ప్రజలే పొగుడుతారని తెలిపారు. తెలంగాణ మీద కక్ష చూపించకుండా, ప్రతిరోజు తెలంగాణ జాతిని అవమానించకుండా, తెలంగాణకు కెసిఆర్ కంటే ఎక్కువ మంచి చేస్తే తప్పకుండా రేవంత్ రెడ్డి గురించి నాలుగు మంచి మాటలు ప్రజలు చెబుతారని అన్నారు. లేకుంటే బరాబర్ రేవంత్ రెడ్డిని నిలదీస్తారని, తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు స్వభావం ఉంటుందని వ్యాఖ్యానించారు. మెదక్‌లో ఇంకా కొన్ని గాడిదలు ఉన్నాయని, వాటి సంగతి బిఆర్‌ఎస్ కార్యకర్తలు చూసుకుంటారని అన్నారు. పూర్వ మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాలు, అన్ని పార్లమెంట్ స్థానాలు, మూడు జిల్లా పరిషత్ లను బిఆర్‌ఎస్ కచ్చితంగా గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ కార్యకర్తలకు తాను, హరీష్ రావు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హరీష్ రావు నాయకత్వంలో తిరిగి జిల్లాలో బిఆర్‌ఎస్ జెండా సగర్వంగా ఎగురుతుందని, మళ్లీ కెసిఆర్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టే వరకు మనమందరం కష్టపడదామని పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డి పాలనలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి : హరీష్‌రావు
రేవంత్ రెడ్డి పాలనలో నీళ్లు ఆంధ్రాకు,నిధులు ఢిల్లీకి వెళుతున్నాయని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. కృష్ణా నదిలో 63 టిఎంసిల నీళ్లను చంద్రబాబుకు అప్పగించింది అబద్ధమా..? అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. గోదావరిలో లక్ష క్యూసిక్కుల నీళ్లు పొతుంది నిజం కాదా…? అని నిలదీశారు.
నాట్లకు నాట్లకు మధ్య కెసిఆర్ రైతుబంధు ఇస్తే, రేవంత్‌రెడ్డి ఓట్లకు ఓట్లకు మధ్య ఇస్తున్నారని విమర్శించారు. తల్లిదండ్రులను చూసుకోని ఉద్యోగులకు జీతాల్లో కోత పెట్టాలని రేవంత్ రెడ్డి అంటున్నారని, ఆరు గ్యారెంటీలు,420 హామీలు అమలు చేయని రేవంత్ రెడ్డికి ఏం కోత పెట్టాలో చెప్పాలని అడిగారు. రెండు పిల్లర్లు కుంగితే మేడిగడ్డను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం దగ్గర విషయం లేదని విమర్శించారు. నేడు రైతులకు యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
తెలంగాణ ఉద్యమకారులు తిరిగి బిఆర్‌ఎస్ పార్టీలో చేరడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మెదక్ అంటే కెసిఆర్‌కు చాలా ఇష్టం అని తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రం కావాలని ఎన్నో ఏళ్ల కల అని, ఆ కళను నిజం చేసింది కెసిఆర్ అని వ్యాఖ్యానించారు. మెదక్ రూపురేఖలు ఎంత అద్భుతంగా మారాయో అందరికీ తెలుసు అని పేర్కొన్నారు. మెదక్ జిల్లా పరిషత్ స్థానాన్ని గులాబీ జెండా గెలుస్తుందని, మెదక్ మున్సిపాలిటీలో బిఆర్‌ఎస్ గెలవడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో బిఆర్‌ఎస్ మూడు జిల్లా పరిషత్ స్థానాలను గెలుస్తుందని, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావడం ఖాయం అని పేర్కొన్నారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం బిఆర్‌ఎస్ పార్టీకి మొదటి నుంచి అండగా ఉందని తెలిపారు.