రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబు కోసం తెలంగాణ నీళ్లను ఆంధ్రకు పంపుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. బూతులు తప్ప రైతుల గురించి బేసిక్ నాలెడ్జ్ లేని రేవంత్ రెడ్డి అసమర్థత పాలనతో 18 నెలల నుంచి తెలంగాణలోని 70 లక్షల మంది అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ, తెలంగాణ రైతులను మోసం చేస్తూ గురువు చంద్రబాబుకు కృష్ణా, గోదావరి నీళ్లను రేవంత్ ఎపికి తరలిస్తున్నారని ఆరోపించారు. గోదావరి నీళ్లను అక్రమంగా ఏపీకి తరలించేందుకు కడుతున్న బనకచర్లకు రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా నీళ్లను దొంగ చాటుగా తీసుకెళ్తుంటే కళ్ళు మూసుకొని చంద్రబాబు కోవర్టుగా రేవంత్ వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.
ఏ ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉంది అని చిన్న పిల్లాడిలా ఇరిగేషన్ అధికారులను రేవంత్ అడుగుతుంటే ఇతనా మనకు న్యాయం చేసేదని రాష్ట్రంలోని రైతులు బాధపడుతున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్, కెసిఆర్‌తో తాము ఉద్యమాన్ని నడిపామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే నినాదంతో పనిచేస్తున్నారని, కానీ ఆంధ్రకు నీళ్లను, నిధులను ఢిల్లీకి పంపుతూ తన తొత్తులకు నియామకాలు ఇచ్చుకొని రేవంత్ మురిసిపోతున్నాడని చెప్పారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లింది యూరియా బస్తాల కోసం కాదని ఆరోపించారు. ఏ బస్తాలు మోసి రేవంత్ ముఖ్యమంత్రి పదవి కాపాడుకుంటున్నారో అందరికీ తెలుసు అని కెటిఆర్ విమర్శించారు.