హైదరాబాద్: ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే ఏం పీక్కుంటారో పీక్కోండి అని ప్రజలను అంటు బెదిరింపులకు దిగుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం దళిత బంధు సాదన సమితి సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఏం పీక్కుంటారో చూపిస్తారని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు పదవుల్లోకి వస్తారని ఊహించలేదని, అందుకే ఐదు సంవత్సరాల పాటు పదవిలో ఉండే విధంగా రాజ్యాంగం రాశారని కెటిఆర్ చెప్పారు. లేకుంటే దేశంలో రేవంత్ లాంటి వాళ్లను రీకాల్ చేసే వ్యవస్థను దేశంలో కూడా ప్రవేశపెట్టేవారని అన్నారు. రాజకీయాల్లో నేతలపై తిట్లను వాడడం తమకు ఇష్టం లేదని, కానీ రేవంత్ రెడ్డికి ఆయన భాషలో చెబితేనే అర్థమవుతుందని కాబట్టి తాము కూడా అలా మాట్లాడాల్సి వస్తుందని పేర్కొన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు తాము కూడా తిట్లు వాడక తప్పడం లేదని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అని విమర్శించారు. 420 హామీలు ఇచ్చి తెలంగాణలోని సబ్బండ వర్గాలను నిట్టనిలువునా మోసం చేస్తోందన్నారు. 100 రోజుల్లో హామీల అమలు చేస్తామని చెప్పి, ఇప్పుడు అడిగితే సామాజిక మాధ్యమాల నుంచి ప్రజాక్షేత్రం వరకు ప్రతి ఒక్కరిపై అప్రజాసామికంగా కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అణిచివేత చర్యలకు పాల్పడినా, కాంగ్రెస్ ప్రజావ్యతిరేక మోసపూరిత విధానాలను ఎండగట్టడాన్ని మాత్రం ఆపబోమని కెటిఆర్ స్పష్టం చేశారు.