టికెట్లు ఎవరికి ఇచ్చినా గెలిపించుకోవాలి హామీలు అమలు చేయని
కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాతపెట్టాలి భారీ మెజారిటీతో బిఆర్‌ఎస్
గెలిస్తే అధికారులంతా సెట్‌రైట్ అవుతారు పాలిచ్చే బర్రెను పక్కన
పెట్టి దున్నపోతును తెచ్చుకున్నట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వంపై
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాబోయే అ సెంబ్లీ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రీ ఫైనల్ లాంటివని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. బిఆర్‌ఎస్‌లో టికెట్ ఎవరికి ఇచ్చినా వారిని గెలిపించుకోవాలని క్యాడర్‌కు సూచించారు. వికారాబాద్, సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు భారీ సంఖ్యలో బుధవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కేటీఆర్, ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించి చెప్పాలని పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు డా.ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సిర్పూర్ నియోజకవర్గానికి చెం దిన కాంగ్రెస్ పార్టీ టిపిసిసి సభ్యుడు, మాజీ సింగిల్ విండో చైర్మెన్ అర్షద్ హుస్సేన్, మాజీ కౌటాల ఎంపిపి బుసార్కర్ విశ్వనాథ్,రత్నం సోమయ్య మాజీ సర్పంచ్ తాటినగర్, లు,బసార్కర్ అశోక్ మాజీ ఎంపిటిసి కౌటాల,బెజ్జూర్ మండలం నుండి బారే కుల సంఘం నాయకులు కావుడె నందయ్య,ముదిరాజ్ సంఘం నాయకులు పాకాల బిక్షం,గుమ్మల బాలయ్య,ఆదివాసీ నాయకులు ఎన్క శ్రీహరి ఇతర వందలాది మంది కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
త్వరలోనే ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గం వస్తానని, బహిరంగ సభ నిర్వహించుకుందామని కెటిఆర్ వారితో అన్నారు. రెండు నియోజకవర్గాల నుంచి బిఆర్‌ఎస్‌లో చేరిన వారిని ఉద్దేశించి కెటిఆర్ మాట్లాడుతూ పాలిచ్చే బర్రెను పక్కనపెట్టి ఎగిరితన్నే దున్నపోతును తెచ్చుకున్నట్టు అయిందని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఆరు గ్యారంటీల పేరుతో అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇవాళ తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేసిందన్నారు. మీసేవ కార్యాలయాల్లో ఇచ్చే రేషన్ కార్డులను జారీ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద సభల్లో గప్పాలు కొట్టుకుంటున్నాడని కేటీఆర్ విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలుచేయని కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో విపరీతమైన కోపం, అసంతృప్తి ఉన్నాయని, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు రేవంత్ ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి
వికారాబాద్, సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యంలో బీఆర్‌ఎస్ లో చేరిన అనంతరం వారిని ఉద్దేశించి కెటిఆర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో బీఆర్‌ఎస్ గెలిచిన తరువాత కాంగ్రెస్ కార్యకర్తల్లాగా పనిచేస్తున్న అధికారులంతా సెట్ రైట్ అవుతారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పిసిలాగా గెలవండి మిమ్మల్ని ఏ అధికారి వేధించడని పేర్కొన్నారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న అంతులేని వ్యతిరేకతను అందిపుచ్చుకోవాలని సూచించారు. అభ్యర్థితో సంబంధం లేకుండా కారు గుర్తుకు ఓటు వేసేలా ప్రజలను చైతన్యపరిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికారాబాద్, సిర్పూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, జిల్లా పరిషత్ స్థానం బీఆర్‌ఎస్‌దే అవుతుందని అన్నారు.
రాబోయే ఎన్నికలోఓ్ల అధికారంలోకి వచ్చాక గతంలో చేసిన తప్పును పునరావృత్తం చేయమని, అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యకర్తలు, నాయకులను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటామని కెటిఆర్ వివరించారు. వికారాబాద్ ప్రజల దశాబ్దాల స్వప్నమైన జిల్లాను ఏర్పాటు చేసి సరిగా చెప్పుకోలేపోయామని అన్నారు. వికారాబాద్‌కు మెడికల్, నర్సింగ్ కాలేజ్ వస్తుందని కలలో కూడా ఎవరు అనుకోలేదని, కానీ కేసీఆర్ దాన్ని సాకారం చేశారని గుర్తు చేశారు. పెన్షన్లు రూ.2000 అవుతాయని, రైతు బంధు ఠంచన్ గా పడుతుందని, రుణమాఫీ అవుతుందని, రైతు బీమా చేస్తారని, బాలింతలకు కేసిఆర్ కిట్ ఇస్తామని ఎవరు అనుకోలేదు, కానీ అవన్నీ చేసి చూపించాము, అయితే వాటిని మాత్రం సరిగా ప్రజలకు చెప్పుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డలకు రూ.300 కోట్ల వడ్డీ లేని రుణాలను ఇచ్చి ఏదో ఘనకార్యం చేసినట్టు కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుందని ఎద్దేవా చేశారు. కానీ కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడబిడ్డలకు రూ.3000 కోట్ల వడ్డీ లేని రుణాలను ఇచ్చారని, కానీ ఏనాడు దాన్ని గొప్ప పనిలాగా చెప్పుకోలేదని తెలిపారు.
పింఛన్‌దారులు ఒక్కొక్కరికి రూ.40 వేలు రేవంత్‌రెడ్డి బాకీ పడ్డారు
ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందని కెటిఆర్ విమర్శించారు. పింఛన్ తీసుకునే పెద్దమనుషులు ఒక్కొక్కరికి రేవంత్ రెడ్డి రూ.40 వేల చొప్పున బాకీ ఉన్నారని అన్నారు. ఆడపిల్లలకు ఐదు లక్షల భరోసా కార్డు, స్కూటీలు, నెలకు రూ.2500 ఇవ్వాల్సింది ఇవ్వలేదని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలోని ప్రతీ ఆడబిడ్డకు రేవంత్ రెడ్డి రూ.50 వేల బాకీ ఉన్నాడని అన్నారు. రాహుల్ గాంధీ ఫోటోతో గ్యారెంటీ కార్డులు ఇచ్చి ప్రజలకు కాంగ్రెస్ నాయకులు అరచేతిలో వైకుంఠం చూపించారని ధ్వజమెత్తారు. ముఖం బాగా లేక అద్దం పగలగొట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు పాలన చేతగాక, సమర్థత లేక రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం చేతకాని దద్దమ్మ రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక కేసీఆర్ ను నిందిస్తున్నారని ఆరోపించారు.