అసెంబ్లీ సమావేశాల్లో తమకు మాట్లాడే అవకాశం ఇస్తే వ్యవసాయ విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు వ్యవసాయ సంక్షేమానికి కెసిఆర్ చేసిన కార్యక్రమాలు, పథకాల గురించి వివరిస్తామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ శాసనసభ లోపల, వెలుపల బిఆర్‌ఎస్ ఆందోళనలతో హోరెత్తించింది. కెటిఆర్ నాయకత్వంలో గన్‌పార్క్ దగ్గర యూరియా కోసం బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు ఖాళీ యూరియా బస్తాలను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘గణపతి బప్పా మోరియా.. కావాలయ్యా యూరియా’, ‘రేవంత్ దోషం.. రైతన్నకు మోసం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. ప్రజల కష్టాలు, రైతుల సమస్యలపై చర్చించడానికి కనీసం 15 రోజుల పాటు లేదంటే అంతకంటే ఎక్కువ రోజులు అసెంబ్లీ నిర్వహించినా చర్చలో పాల్గొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
పంట నష్టపోయిన రైతుల గురించి కానీ, భారీ వర్షాలతో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందుల గురించి గానీ అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఇవ్వాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం గురించి కూడా తాము స్పష్టమైన సమాధానం చెబుతామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసింది పిసి ఘోష్ కమిషన్ కాదు.. అది కాంగ్రెస్ పార్టీ వేసుకున్న పిసిసి ఘోష్ కమిషన్ అని ఎద్దేశా చేశారు. రాష్ట్రంలో తీవ్రమవుతున్న వ్యవసాయ సంక్షోభం పైన అసెంబ్లీలో చర్చ పెట్టాలని పేర్కొన్నారు. అసమ్మతి ఎంఎల్‌ఎల అంశంలో స్పీకర్ తీసుకునే నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని తెలిపారు.